హెచ్‌ఐవీ బ్లడ్‌ కలకలం.. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు

Madras High Court Orders On HIV Blood Donor Autopsy - Sakshi

రక్తదానం చేసిన వ్యక్తి ఆత్మహత్య

కుమారుడి మృతిపై తల్లిదండ్రుల అనుమానం

పోస్టుమార్టంను వీడియో తీయాలని కోర్టు ఆదేశాలు

తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రి ల్యాబ్‌ టెక్నీషియన్ల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి హెచ్‌ఐవీ బారిన పడగా.. తన కారణంగా రెండు జీవితాలు హెచ్‌ఐవీకి బలికావాల్సి వస్తోందని రక్తం దానం చేసిన యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలొదిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులంటే వణకు పుట్టేలా చేస్తోంది.

సాక్షి, చెన్నై : గర్భిణికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ రక్తం ఎక్కించిన వివాదం పెనుభూతంగా మారిపోగా ఇందుకు కారకులైన బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిస సంగతి తెలిసిందే. కాగా, రక్తదానం చేసిన యువకుడు (19) తీవ్ర మనస్తాపంతో ఎలుకలమందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. మధురై రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలొదిలాడు. అయితే, మృతుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్‌ఐవీ బ్లడ్‌!)

బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన తమ కొడుకు శుక్రవారం వరకు బాగానే ఉన్నాడని తెలిపారు. డాక్టర్లు వచ్చి ఏదో సూదిమందు ఇచ్చిన తర్వాతనే అతని ఆరోగ్యం క్షీణించిందని ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మృతి వెనుక కారణాలను వెలికితీసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ స్వీకరించిన హైకోర్టు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే విషయంలో సోమవారం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణలో పోస్టుమార్టం చేయాలనీ, ఆ ప్రక్రియనంతా వీడియోలో చిత్రీకరించాలని రాజాజీ ప్రభుత్వాస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, హెచ్‌ఐవీ సోకిన శరీరానికి 72 గంటలలోపు పోస్టుమార్టం చేయడం కుదరదని ఆస్పత్రి డీన్‌ షణ్ముగసుందరం కోర్టుకు విన్నవించారు. అలా చేస్తే డాక్టర్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదముందని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనల ప్రకారమే పోస్టుమార్టం చేయాలని కోర్టు వెల్లడించింది. వీడియో చిత్రీకరణ చేయాలని పునరుద్ఘాటించింది. (మరో గర్భిణికి హెచ్‌ఐవీ రక్తం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top