ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ ఆపకండి | Later, FCI procurement by the Rationale | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ ఆపకండి

Mar 31 2015 2:49 AM | Updated on Aug 15 2018 2:20 PM

ఎఫ్‌సీఐ ద్వారా చేపట్టే ధాన్యం సేకరణను నిలిపివేసే ప్రయత్నలను ఉపసంహరించుకోవాలని.. ఎరువుల సబ్సిడీని పరిమితం చేయరాదని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వైఎస్సార్ కాంగ్రెస్ కోరింది.

  • శాంతకుమార్  కమిటీ సిఫారసులను తిరస్కరించండి
  • ప్రధానమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ వినతిపత్రం
  • సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్‌సీఐ ద్వారా చేపట్టే ధాన్యం సేకరణను నిలిపివేసే ప్రయత్నలను ఉపసంహరించుకోవాలని.. ఎరువుల సబ్సిడీని పరిమితం చేయరాదని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వైఎస్సార్ కాంగ్రెస్ కోరింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు సోమవారం ప్రధానిని కలిసి ఈమేరకు ఒక వినతిపత్రం అందించారు. ‘‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)ను పునర్‌వ్యవస్థీకరించేందుకు వీలుగా శాంతకుమార్ కమిటీ చేసిన సిఫారసుల నివేదికను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే వ్యవసాయాధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులకు ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. చివరకు దేశ ఆహార భద్రతకు కూడా ముప్పు తెస్తుంది. ఆ సిఫారసులను ఆమోదిస్తే అటు ఆహార భద్రతతో పాటు.. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడిన 50 శాతం మంది ప్రజల జీవనోపాధి కూడా దెబ్బతింటుంది’’ అని ఆ వినతిపత్రంలో ఆందోళన వ్యక్తంచేశారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ...
     
    ఎఫ్‌సీఐ సేకరించకపోతే...

    ‘‘రైతులు తమ పంటలను మంచి ధర వచ్చేంతవరకు గిడ్డంగుల్లో దాచుకునే పరిస్థితి లేదు. పంట పండిన కొద్ది రోజుల్లోనే వారు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ పంటను ఎఫ్‌సీఐ సేకరించలేదంటే తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతయి. ఇది మానవ తప్పితమైన విషాదంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితినే చూస్తే 2010-11లో మంచి దిగుబడులు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎఫ్‌సీఐ కూడా కనీస మద్దతు ధర రైతులకు అందేలా చేయడంలో విఫలమైంది. రైతులు క్వింటాలు ధాన్యాన్ని రూ. 300 ధరకు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. ఇది రైతులను తీవ్రంగా కుంగదీసింది. దీంతో వారు క్రాప్ హాలిడే ప్రకటించారు.
     
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 35 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. పైగా పంట చేతికి వచ్చిన అక్టోబరు, నవంబరు మాసాల్లో సేకరణ జరగలేదు. దీని కారణంగా రైతులు కనీస మద్దతు ధర కంటే రూ. 150 తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. అలాగే సరైన సమయంలో పత్తి పంట సేకరించడంలో సీసీఐ పూర్తిగా విఫలమైంది. రైతులు తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్‌సీఐల విధులను రాష్ట్రాలు నిర్వర్తిస్తాయని కేంద్రం ఎలా నమ్ముతోంది? గడిచిన పదేళ్లలో 75 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ బాధ్యతలను స్వీకరించేందుకు ఆర్థిక వనరులెక్కడివి? ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 2015-16 బడ్జెట్‌లో మార్కెట్ నిర్వహణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలుస్తోంది.’’
     
    స్వామినాథన్ సిఫారసులు అమలుచేయండి

    ‘‘మద్దతు ధరను నిర్ధారించేందుకు ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలుచేయాలని నాడు ఎన్‌డీయే కూడా కోరింది. కానీ 2014-15 సంవత్సరంలో ఎన్‌డీయే అతి తక్కువగా కనీస మద్దతు ధరను పెంచింది. పంట ఉత్పత్తికి అయ్యే వ్యయంతోపాటు 50 శాతం లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్‌పీని ఖరారుచేయాలని ఆ కమిషన్ సూచించింది. ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో 2015-16 ఖరీఫ్ సీజన్‌లో వరికి కనీసం రూ. 1,700 ఎంఎస్‌పీగా ఖరారుచేయాల్సిన అవసరముంది. లేదంటే రైతులు దురవస్థలోనే కొనసాగుతారు. మా రాష్ట్రంలో రైతులు వరస తుఫాన్లతో, వరద్లతో గడిచిన నాలుగేళ్లుగా నష్టపోతున్నారు. రాయలసీమ ప్రాంతం,  తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒక తుపాను నుంచి కోలుకోకముందే మరో తుపానులో రైతు కొట్టుకుపోతున్నాడు. ఇలా దెబ్బతిన్న రైతుల్లో ఒక శాతం వారినీ రాష్ట్రం ఆదుకోవడం లేదు. ఉదాహరణకు ఇటీవల హుద్‌హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం రూ. 21 వేల కోట్ల మేర నష్టపోతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కనీసం దీనిలో 10 శాతం కూడా పునరావాసానికి, సహాయ చర్యలకు ఖర్చుపెట్టలేకపోయాయి.’’
     
    ఎరువుల సబ్సిడీని పరిమితం చేయకండి

     ‘‘శాంతకుమార్ కమిటీ ప్రస్తుతం ఉన్న పద్ధతిని రద్దు చేసి హెక్టారుకు రూ. 7వేల చొప్పున ఎరువుల సబ్సిడీ ప్రకటించాలని సిఫారసు చేసింది. ఏపీ వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎన్‌పీకే వినియోగం చాలా ఎక్కువ. హెక్టారుకు రూ. 7 వేలకు పరిమితి విధిస్తే మాలాంటి రాష్ట్రాల్లో ఒక్క పంటకు కూడా సరిపోదు.  రెండో పంటకు రైతులు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు కొనుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల శాంతకుమార్ నివేదికను తిరస్కరించండి. కనీస మద్దతు ధరను ఖరారు చేసేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయండి.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement