భూసేకరణ బిల్లును లోక్‌సభలో సొంతబలంతో ఆమోదింపజేసుకున్నా.. అసలు పరీక్షను ఎన్డీఏ సర్కారు పెద్దల సభలోనే ఎదుర్కోబోతోంది.
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును లోక్‌సభలో సొంతబలంతో ఆమోదింపజేసుకున్నా.. అసలు పరీక్షను ఎన్డీఏ సర్కారు పెద్దల సభలోనే ఎదుర్కోబోతోంది. నిరసనల మధ్య అయినా బిల్లును ప్రవేశపెట్టి.. ఒక వేళ తిరస్కారానికి గురైతే, తర్వాత ఉభయ సభల సంయుక్త భేటీ ఏర్పాటు చేసి ఆమోదింపజేసుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం. రాజ్యాంగ నియమాల ప్రకారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన6వారాల్లోగా ఆర్డినెన్సుకు చట్టరూపం తీసుకురావాలి. లేకపోతే ఆర్డినెన్సు మురిగిపోతుంది. దీని ప్రకారం ఏప్రిల్ 5లోగా భూసేకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించాలి.
బడ్జెట్ తొలిదశ సమావేశాలు మార్చి 20న ముగుస్తాయి. కాబట్టి మార్చి 20 లోగానే బిల్లుకు ఆమోద ముద్ర పడాలి. అయితే బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టినప్పటికీ, దాన్ని అడ్డుకోవటం ద్వారా, సమావేశాలను స్తంభింపజేయటం ద్వారా బిల్లును పెండింగ్‌లో ఉంచాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. లోక్‌సభలో బిల్లుకు ఓటింగ్ సమయంలో.. మిత్రపక్షం శివసేన గైర్హాజరు అయింది. రాజ్యసభలోనూ ఇదే వైఖరి అవలంబిస్తామని కూడా స్పష్టం చేసింది.
ప్రత్యామ్నాయాలేమిటి?
రాజ్యసభ తిరస్కరించిన పక్షంలో మోదీ సర్కారు సంయుక్త సమావేశం పిలవచ్చు. అయితే సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తే ఒకే అంశం అజెండాగా ఉండాలి. అందుకే ప్రభుత్వం గనుల బిల్లును విపక్షాలు కోరినట్లుగా సెలెక్ట్ కమిటీకి నివేదించింది.
రాజ్యాంగంలోని 118 అధికరణం ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లు కాకుండా మరేదైనా బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు.
ఒక సభలో బిల్లు ఆమోదం పొంది మరో సభలో పెండింగ్‌లో ఉంచకుండా తిరస్కరించినప్పుడు మాత్రమే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటి వరకూ మూడు సార్లు మాత్రమే ఇలా సంయుక్త సమావేశాన్ని పిలిచారు.