ఔరంగాబాద్‌ ప్రమాదంపై దర్యాప్తు

Inquiry Ordered in Aurangabad Train Accident: Piyush Goyal - Sakshi

న్యూఢిల్లీ: విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటన జరిగిన తర్వాతి రోజే దేశంలో మరో దుర్ఘటన చోటుచేసుకోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఔరంగాబాద్‌ రైలు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి చెందారు. రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు రైల్వే మంత్రి తీసుకుంటున్నారని ట్విటర్‌లో ప్రధాని మోదీ వెల్లడించారు. ఔరంగాబాద్‌ ప్రమాదంపై రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశించినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ సమీపంలో  శుక్రవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో 16 మంది మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఔరంగాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దక్షిణమధ్య రైల్వే(ఎస్‌సీఆర్‌) పరిధిలోని నాందేడ్‌ డివిజన్‌లో ఔరాంగాబాద్‌-జాల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌సీఆర్‌ ముఖ్య సమాచార అధికారి తెలిపారు. ఔరాంగాబాద్‌ జిల్లా కర్మాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారని చెప్పారు. (నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన రైలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top