భారత్‌ ‘గగన’ విన్యాసం..!

Indian Air Force Conducted Military Acrobatics - Sakshi

గత  మూడు దశాబ్దాల్లో అతి పెద్ద ప్రదర్శన

పూర్తిస్థాయి దళాలు, యుద్ధ విమానాల  వినియోగం

సాక్షి, హైదరాబాద్‌ : భారత వాయుసేన భారీ సైనిక  కసరత్తుకు తెరతీసింది.  శత్రుదేశాల నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా అతి తక్కువ సమయంలోనే కార్యరంగంలోకి దూకేలా తన సన్నద్ధతకు మరింత పదునుపెడుతోంది. దీనిలో భాగంగా గతంలో కనీవినీ ఎరుగని విధంగా దేశవ్యాప్తంగా ఉన్న  తన స్థావరాల్లోని  మొత్తం విమానాలు, సిబ్బందిని పరీక్షించేలా  పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతోంది.  ‘గగన్‌శక్తి–2018’ పేరిట ఈ నెల 10 నుంచి 23 తేదీ వరకు అత్యు న్నతస్థాయి  సైనిక విన్యాసాలు  నిర్వహిస్తోంది.

రెండు దశల్లో  పాకిస్థాన్, చైనా సరిహద్దులలో చేపడుతున్న అత్యంత విస్తృత శిక్షణా కార్యక్రమాల ద్వారా తన అపార సైనిక శక్తిని, యుద్ధానికి  ఎప్పుడైనా రెడీ అనేలా  వాయుసేన బలాన్ని ప్రదర్శిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతమంతా విస్తరించేలా భారత్‌ చేపట్టిన ఈ కసరత్తు  గత కొన్ని దశాబ్దాల కాలంలోనే అతి పెద్దది. భారత సైన్యం (ఆర్మీ), నావికా (నేవీ)దళంతో కూడా కలిసి వాయుసేన సంయుక్త సైనిక  చర్యలు చేపట్టడం దీని ప్రత్యేకత. ఇందులో వాయుసేనకు సంబంధించిన యావత్‌ యుద్ధవిమాన శ్రేణులు పాల్గొంటున్నాయి. 

ఎందుకు ?

వైమానిక దళానికి సంబంధించి ప్రతిదాడులతో సహా అన్ని బలాలు పరీక్షించడం
యుద్ధసన్నద్ధతలో భాగంగా వివిధ విభాగాలు,రంగాల  సమన్వయంపై సమీక్ష 
వాయుసేనకున్న బలం,బలగాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ రంగంలో తనకున్న అధిపత్యం చాటడం.

ప్రత్యేకతలు...

ఈ కసరత్తులో  1,100 యుద్ధ  (సిబ్బంది, ఆయుధాల రవాణాతో సహా) విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. 300 మందికి పైగా ఫైటర్‌ పైలట్లు, ఇతర ఉన్నతస్థాయిఅధికారులు, 15 వేల మంది వైమానికదళ సభ్యులు పాల్గొన్నారు. ఎడారి ప్రాంతాలు మొదలుకుని, అత్యంత ఎల్తైన ప్రాంతాలు, సముద్రజలాలు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే ఆపరేషన్లు, గరుడ కమాండోల దాడుల వరకు విస్తృతస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశంలో, ఆకాశం నుంచి భూమిపైకి దాడి, పారాట్రూపర్ల ద్వారా మెరుపుదాడి, యుద్ధంలో గాయపడిన సైనికుల తరలింపు వంటి వాటిని పరీక్షించింది. 

ఏవేవి పరీక్షించారు...

బ్రహ్మోస్, హార్‌పూన్‌ యాంటీ–షిప్‌ క్షిపణులతో కూడిన సుఖోయ్‌ (ఎస్‌యూ)–30, జాగ్వార్‌ యుద్ధ విమానాలు తమ లక్ష్యాలు చేధించడాన్ని పరిశీలించారు. 

సీ–17 గ్లోబ్‌మాస్టర్, ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు, సీ–130జే సూపర్‌ హెర్‌క్యులస్‌ రవాణా విమానాల పనితనాన్ని పరీక్షించారు.

పాకిస్థాన్‌తో ఉన్న  పశ్చిమ సరిహద్దులో కేవలం మూడురోజుల్లోనే 5వేల సార్లు యుద్ధవిమానాలు రాకపోకలు సాగించడం విశేషం.

భారత వాయుసేనకు చెందిన పీ–8ఐ ఎమ్మార్‌ విమానాన్ని ఉపయోగించి  సుదూర లక్ష్యాల చేధన పరీక్ష.

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి ఇటీవలే ప్రవేశించిన ఎల్‌సీఏ (లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) తేజాస్‌ను తొలిసారి పరీక్షించారు. తేజాస్‌ మార్క్‌–1ను ఇప్పటికే ఆమోదించిన ఐఏఎఫ్, దానిని త్వరలోనే మరింత నవీకరించి తేజస్‌ మార్క్‌–1ఏ, తేజస్‌–మార్క్‌ 2 లను  రంగంలోకి దించనుంది.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top