భారత్‌ ప్రతిష్ట పెరుగుతోంది : మోదీ

India open defecation-free, country's stature on rise - Sakshi

ఇండియా ఇప్పుడు బహిరంగ మల విసర్జన రహితం

గుజరాత్‌లో ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత ప్రతిష్ట ఏ స్థాయిలో పెరిగిందో అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో స్పష్టంగా తెలిసిందన్నారు. భారత్‌ ఇప్పుడు బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా నిలిచిందన్నారు. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌లో పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. న్యూయార్క్‌లో ఐరాస వేదికగా మోదీ చేసిన ప్రసంగాన్ని ప్రశంసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రావడమే కాకుండా, కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ఉన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఙతలని పేర్కొన్నారు.

అంతేకాకుండా, కార్యక్రమం ముగిశాక, తన కోరికపై, భద్రతపరమైన ప్రమాదాలను పట్టించుకోకుండా స్టేడియంలో తనతో కలియతిరిగారని ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. భారత పాస్‌పోర్ట్‌ ఉన్నవారి పట్ల ప్రపంచ దేశాల్లో గౌరవం పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సానుకూల మార్పులకు భారత్‌ వేదిక అవుతోందన్న విషయాన్ని ప్రపంచం గుర్తిస్తోందని మోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన స్వచ్ఛభారత్‌ దివస్‌ కార్యక్రమంలో కూడా మోదీ పాల్గొన్నారు. ‘ఈ రోజు గ్రామీణ భారతం, గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్‌)మయ్యాయి’ అని ప్రకటించారు. అలాగే, ‘ఓడీఎఫ్‌ ఇండియా’ మ్యాప్‌ను ఆవిష్కరించారు. 60 నెలల్లో 60 కోట్ల ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడంపై ప్రపంచం భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతోందన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగవద్దని, ఇంకా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పారిశుద్ధ్యం, ప్రకృతి పరిరక్షణ గాంధీజీకి ఎంతో ఇష్టమైన విషయాలన్నారు. 2022 నాటికి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నామరూపాలు లేకుండా చేయాలన్నారు. అంతకుముందు, సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమంలోని విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి మ్యూజియంను, ఆశ్రమంలో గాంధీ నివాసం హృదయ కుంజ్‌ను సందర్శించారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయం పంచుకున్నారు. ‘గాంధీజీ స్వప్నమైన స్వచ్ఛభారత్‌ ఆయన 150వ జయంతి రోజు నిజం కావడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఈ సందర్భంగా నేను ఈ ఆశ్రమంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక 1917లో ఈ ఆశ్రమాన్ని గాంధీజీ నెలకొల్పారు. 1930 వరకు ఇక్కడే ఉన్నారు. 1930లో దండియాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రూ. 150 నాణాన్ని  ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top