breaking news
open defecation-free zone
-
భారత్ ప్రతిష్ట పెరుగుతోంది : మోదీ
అహ్మదాబాద్: ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత ప్రతిష్ట ఏ స్థాయిలో పెరిగిందో అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో స్పష్టంగా తెలిసిందన్నారు. భారత్ ఇప్పుడు బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా నిలిచిందన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. న్యూయార్క్‌లో ఐరాస వేదికగా మోదీ చేసిన ప్రసంగాన్ని ప్రశంసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావడమే కాకుండా, కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ఉన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఙతలని పేర్కొన్నారు. అంతేకాకుండా, కార్యక్రమం ముగిశాక, తన కోరికపై, భద్రతపరమైన ప్రమాదాలను పట్టించుకోకుండా స్టేడియంలో తనతో కలియతిరిగారని ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. భారత పాస్‌పోర్ట్ ఉన్నవారి పట్ల ప్రపంచ దేశాల్లో గౌరవం పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సానుకూల మార్పులకు భారత్ వేదిక అవుతోందన్న విషయాన్ని ప్రపంచం గుర్తిస్తోందని మోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో కూడా మోదీ పాల్గొన్నారు. ‘ఈ రోజు గ్రామీణ భారతం, గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్)మయ్యాయి’ అని ప్రకటించారు. అలాగే, ‘ఓడీఎఫ్ ఇండియా’ మ్యాప్‌ను ఆవిష్కరించారు. 60 నెలల్లో 60 కోట్ల ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడంపై ప్రపంచం భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతోందన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగవద్దని, ఇంకా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్యం, ప్రకృతి పరిరక్షణ గాంధీజీకి ఎంతో ఇష్టమైన విషయాలన్నారు. 2022 నాటికి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నామరూపాలు లేకుండా చేయాలన్నారు. అంతకుముందు, సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమంలోని విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి మ్యూజియంను, ఆశ్రమంలో గాంధీ నివాసం హృదయ కుంజ్‌ను సందర్శించారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయం పంచుకున్నారు. ‘గాంధీజీ స్వప్నమైన స్వచ్ఛభారత్ ఆయన 150వ జయంతి రోజు నిజం కావడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఈ సందర్భంగా నేను ఈ ఆశ్రమంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక 1917లో ఈ ఆశ్రమాన్ని గాంధీజీ నెలకొల్పారు. 1930 వరకు ఇక్కడే ఉన్నారు. 1930లో దండియాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రూ. 150 నాణాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. -
మేకలు అమ్మి.. బాత్రూమ్ కట్టించింది..
రాయ్‌పూర్ : గ్రామాల్లో టాయిలెట్లు, బాత్రుమ్‌లు కట్టించి పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన్పటికీ.. ఎటువంటి మార్పులేదు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, బీహార్ వంటి రాష్ట్రాలలోమహిళలు, బాలికల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 102ఏళ్ల బామ్మ కువార్బాయ్ యాదవ్ ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి యత్నించి సక్సెస్ సాధించారు. బహిర్భూమికి బయటకు వెళ్లాల్సి వస్తోందని, వయసు మీద పడుతుండటంతో మరింత కష్టమని భావించిన శతాధిక వృద్ధురాలు వినూత్నంగా ఆలోచించారు. తన వద్ద ఉన్న మేకలను అమ్మెసి తద్వారా వచ్చిన డబ్బు రూ. 22,000 తో ఇంటి వద్ద బాత్రూమ్ కట్టించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆమె అందరికీ రోల్ మోడల్‌గా కనిపిస్తున్నారు. బహిరంగ మలవిసర్జన వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని, ఎదురయ్యే ఇబ్బందులను వివరించి వారి ఆలోచనల్లో మార్పును తీసుకురాగలిగారు ఈ బామ్మ. దంతారి జిల్లాలోని కోటబరి గ్రామస్తులు ఆమె విధానాన్ని అభినందిస్తూ, అనుసరిస్తుండటం గమనార్హం. 450 కుటుంబాల వారు ఎలాగైనా సరే తాము కూడా ఇంటి వద్దే మరుగుదొడ్డి కట్టించుకుని తీరుతామని ప్రతిజ్ఞ చేశారట. దంతారి జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందిస్తూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద వీటి నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. శతాధిక వృద్ధురాలు కువార్బాయ్ యాదవ్ ఆలోచన, ఆచరణ సొంత గ్రామంతో పాటు జిల్లా అధికారులలో కూడా మార్పు తీసుకువచ్చారు.