కరోనా పరీక్షల్లో వెనకపడ్డ భారత్‌

India Lagging Behind Other Countries In Corona VIrus Tests - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘పరీక్షలు, పరీక్షలు, పరీక్షలు జరపండీ! కరోనా వైరస్‌పై యుద్ధం చేయడానికి ఇదే అసలైన, అవసరమైన మార్గం’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ అధానమ్‌ గెబ్రియేసెస్‌ మార్చి 16వ తేదీన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అయినప్పటికీ భారత్‌ ఈ విషయంలో పెద్దగా స్పందించినట్లు లేదు. మార్చి 23వ తేదీ వరకు భారత్‌లో కేవలం 18,383 మందికి మాత్రమే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 433 మందికి కోవిడ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే దాదాపు సగం కేసులు నమోదయ్యాయి.

అదే మార్చి 18వ తేదీ నాటికే ఇటలీలో 1,65,541 మందికి, దక్షిణ కొరియాలో 2,95,647 మందికి పరీక్షలు నిర్వహించింది. దక్షిణ కొరియా ప్రతి రోజూ 20 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తోంది. బ్రిటన్‌ రోజుకు 1500 ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మున్ముందు రోజుకు పది వేల మందికి చొప్పున పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. భారత్‌ కరోనా పరీక్షలు ఇంత తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని పుణేకు చెందిన ‘గ్లోబల్‌ హెల్త్, బయోటిక్స్, హెల్త్‌ పాలసీ’ రిసర్చర్‌ అనంత్‌ భాన్‌ హెచ్చరిస్తున్నారు. (మరోసారి జాతి ముందుకు ప్రధాని మోదీ)

భారత్‌లో ఇంతవరకు ప్రభుత్వ లాబరేటరీల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా 12 ప్రైవేటు ల్యాబుల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా 118 ప్రభుత్వ ల్యాబుల్లో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించే సామర్థ్య ఉండగా ఇంతవరకు 92 ల్యాబుల్లోనే పరీక్షలు నిర్వహించారు. మరో 26 ల్యాబుల్లో పరీక్షలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. తెలంగాణలో సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల ఆస్పత్రి, హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాల ఆస్పత్రి ల్యాబుల్లోనే కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా, తాజాగా హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌లోని అపోలో ప్రైవేటు ఆస్పత్రికి కోవిడ్‌ పరీక్షల అనుమతి మంజూరు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలియజేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీవేంకటేశ్వర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (తిరుపతి), రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ (కాకినాడ), సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్‌ (విజయవాడ), గవర్నమెంట్‌ కాలేజ్‌ (అనంతపురం) ల్లో కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఒక్క ప్రైవేటు ఆస్పత్రికి ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. ప్రభుత్వ అనుమతి ల్యాబుల్లో కూడా ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారికి, కరోనా నిర్ధారితుల బంధువులకు, వారితో సన్నిహితంగా మెదిలిన వారికి మాత్రమే ఈ పరీక్షలు జరపుతున్నారు. (కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..)

ఢిల్లీలోని ద్వారకా ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల హసీబుల్‌ నిషా గత ఆరు రోజులుగా పొడి దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడుతున్నారు. కరోనా వైరస్‌ సోకిందనే అనుమానంతో మూడు ప్రైవేటు ఆస్పత్రులు తిరిగిన ప్పటికీ పరీక్షలు నిర్వహించేందుకు నిరాకరించారట. ప్రభుత్వాస్పత్రికి వెళితే పారాసిటమాల్‌ ఇచ్చి పంపించారట. ఏ విదేశానికి వెళ్లనందున, విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా లేనందున కరోనా పరీక్షలు అవసరం లేదని చెప్పి పంపించారట. ఒకవేళ మున్ముందు ఆమెకు కరోనా ఉన్నట్లు తేలితే.....(కరోనాపై చైనా గెలిచిందిలా..!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top