20 రాష్ట్రాల్లో హాయిగా తిరిగాను... | Sakshi
Sakshi News home page

20 రాష్ట్రాల్లో హాయిగా తిరిగాను...

Published Thu, Dec 31 2015 3:08 PM

20 రాష్ట్రాల్లో హాయిగా తిరిగాను...

చీకటిని చూసి భయపడితే ఎప్పటికీ భయంగానే ఉంటుంది...ఆ చీకట్లోకి వెళ్ళినప్పుడే అక్కడ ఏముందో తెలుస్తుంది. ఇంచుమించుగా ఇటువంటి అనుభవాన్నే ఆ మహిళ ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకుంది. భారత దేశంలో మహిళ ఒంటరి ప్రయాణం సురక్షితం కాదు.. అన్న అనుమానం నిజమా కాదా అన్నది నిరూపించాలని నిర్ణయించుకుంది.  ప్రతిరోజూ జరిగే  భయంకరమైన ఘటనల గురించి విని, చదివి భయపడే వారికి భిన్నంగా ఆలోచించింది. దేశంలోని ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించి తన అనుభవాలను వివరించింది.

ముఖ్యంగా అంతా భయపడే ప్రాంతమైన ఛత్తీస్గఢ్ బస్తర్ లో ఓ మహిళ  ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలనుకుంది స్వాతీ జైన్. అక్కడివారంతా తనను ఎంతో వింతగా చూస్తారని అభిప్రాయపడింది. కానీ వారు తనపై చూపిన ఆదరణ, సహాయ సహకారాలకు ఆశ్చర్యపోయింది. మొదటి 96 గంటలపాటు 1300 కిలోమీటర్లు గిరజన ప్రాంతంలో ప్రయాణించిన ఆమె.. దూరంగా చూసి ఏ విషయానికీ భయపడకూడదన్న సత్యాన్ని గ్రహించింది.

ఏ ఒక్కరూ తనవైపు వింతగా చూడలేదని, ముట్టుకోడానికి ప్రయత్నించలేదని, భయపెట్టలేదని చెప్తోంది. నిజంగా అనుమానం పెనుభూతం అన్న సామెతకు ఇదే ఉదాహరణ అంటోంది. ఛత్తీస్గఢ్ లో తన ఒంటరి ప్రయాణం కోసం ముందుగా ట్రావెల్ వెబ్ సైట్లు, పుస్తకాలు సందర్శించిన ఆమె... బస్తర్ ప్రయాణంపై పర్యాటకులకు సలహాదారులు వ్యతిరేక సమాచారం ఇవ్వడాన్నే చూసింది. అయితే అక్కడి పార్కులు, గుహలు వంటి  సందర్శనా స్థలాలతోపాటు... వారు జరుపుకునే దసరా వేడుకను చూడాలన్న ఉద్దేశ్యంతో బస్తర్ లో ప్రయాణించింది.


అలాగే తాను రాజస్థాన్ ప్రాంతంలో ప్రయాణించేప్పుడు ఓ నిర్మానుష్య ప్రాంతంలో టాక్సీ ఆగిపోయినప్పుడు... ఓ దంపతులు ట్రాక్టర్ లో ఎక్కించుకొని తనకు అక్కడికి దగ్గరలోని ఓ సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించారని చెప్తోంది. ముందుగా తాను ఒంటరిగా వారితో ప్రయాణించేందుకు భయపడి... తనతోపాటు పెప్పర్ స్ప్రే వంటివి ఉంచుకున్నానని, అయితే వారు ఆ అర్థరాత్రి సమయంలో సహాయం అందించడమే కాక.. మరుసటిరోజు ప్రయాణానికి కూడా సహకరించారని తెలిపింది. అలాగే కార్గిల్ లోని జాన్స్ కర్ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు తన షేర్ టాక్సీలోని ఓ వ్యక్తి తన కజిన్ గెస్ట్ హౌస్ లో ఆశ్రయం కల్పించాడని, తన ఇల్లులాగే ఫీల్ అవ్వమంటూ ఎంతో మర్యాదగా చూశాడని ఆ ఒంటరి ప్రయాణీకురాలు తన అనుభవాలను వెల్లడించింది.

ప్రతి విషయానికీ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ముందడుగు వేస్తే ఏ ప్రాంతంలోనైనా మహిళలు ఒంటరిగా ప్రయాణించవచ్చని అంటోంది.  అంతేకాదు ప్రపంచంలో అన్ని ప్రదేశాలకన్నా భారత దేశంలోనే మహిళలు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితమని తాను  భావిస్తున్నట్లు వివరిస్తోంది. ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించిన ఆమె... ప్రతివారూ తమ జీవితంలో ఒక్కసారైనా ఒంటరి ప్రయాణం చేసి, ప్రత్యేక  అనుభవాలను మూటగట్టుకోవాలని సలహా ఇస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement