ముంబై వాసులను కదిలించిన రైతుల స్పూర్తి

How Mumbai Residents Welcomed Farmers Marching Through The City - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముంబై నగరానికి చేరుకున్న ‘అఖిల భారత కిసాన్‌ సభ’ రైతులను స్థానిక ముంబై వాసులు అన్ని విధాలుగా ఆదరించారు. ఎగిసి పడుతున్న సముద్ర కెరటాల వలే ఎర్ర జెండాల రెప రెపల మధ్య ఆదివారం అర్ధరాత్రి వరకు తండోపతండాలుగా వస్తున్న రైతులకు నీళ్ల బ్యాటిళ్లు, బిస్కట్‌ ప్యాకెట్లు, పండ్లు, ఫలహారాలు, పొంగలి పొట్లాలను పంచిపెట్టారు. ఈ సామాజిక కార్యక్రమంలో తర తమ భేదం లేకుండా వ్యక్తులు, నివాసితుల సంఘాలు, మతాలు, రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి.

కొన్ని చోట్ల సిక్కులు, ముస్లింలు ఈ సహాయక కార్యక్రమాల్లో ప్రత్యేకంగా పాల్గొన్నారు. సిక్కులు తమ సంప్రదాయం ప్రకారం రొట్టెలు, పప్పును పంచి పెట్టగా, బైకుల్లా జంక్షన్‌ వద్ద ముస్లింలు బిస్కట్లు, ఖర్జూరాలు, వాటర్‌ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఓ చోట ఓ సంస్థకు చెందిన కార్యకర్తలు రైతులకు చెప్పుల జోళ్లను కూడా పంచి పెట్టారని ‘ముంబై మిర్రర్‌’ తెలియజేసింది. సహాయక కార్యక్రమాల్లో పొల్గొన్న వారిలో ఎక్కువ మంది మధ్య తరగతీయులే. 

నగరంలోని ఆజాద్‌ మైదాన్‌కు చేరుకున్న దాదాపు 35 వేల మంది రైతులుకు సోమవారం ఉదయం పలు ఎన్జీవో సంఘాలు అల్పాహారాన్ని పంచిపెట్టాయి. రైతుల పట్ల ముంబై వాసులు చూపిన ఆదరణను తామెన్నటికీ మరువలేమని, తాము ట్రక్కులో వెంట తీసుకొచ్చుకున్న ఆహార దినుసులు ఆదివారం వరకు సరిపోతాయో, లేదో అని ఆందోళన చెందామని, అయితే మార్గమధ్యంలో ప్రజలు ఆహార పొట్లాలు, మంచి నీళ్లు అందించడం వల్ల తమ వద్ద ఇంకా నాలుగు రోజుల వరకు సరిపోయే స్టాక్‌ మిగిలిందని అఖిల భారత కిసాన్‌ సభ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ గుజార్‌ తెలిపారు.
 

వృద్ధాప్యం కారణంగా వడలు కంగి, ఒంట్లో సత్తువ నశించినా ఆశయ సాధన కోసం 180 కిలోమీటర్లు కాలి నడకన వచ్చిన రైతుల స్ఫూర్తియే స్థానిక ముంబై వాసులను కదిలించింది. ఉడతా భక్తిగా తమవంతు సహాయాన్ని అందించారు. 180 కిలోమీటర్లు సాగిన యాత్రలో ఎక్కడా విధ్వంసానికి అవకాశం ఇవ్వకుండా క్రమశిక్షణ పాటించిన రైతులు ముంబై నగరానికి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు స్పందించిన తీరు కూడా అద్భుతం. ఆదివారం అర్ధరాత్రి సోమయ్య మైదానానికి చేరకున్న రైతులు ఈ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో విధాన భవన్‌ను ముట్టడించాల్సి ఉంది.

అలా చేస్తే ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ స్తంభించిపోయి టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకుని ఆజాద్‌ మైదాన్‌కు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. సోమయ్య మైదాన్‌ నుంచి ఆజాద్‌ మైదాన్‌కు మధ్యన దూరం 18 కిలోమీటర్లు. అలసి సొలిసి కదిలేందుకు మొండికేస్తున్న దేహాలకు కాస్త విశ్రాంతినిద్దామనుకుంటున్న తరుణంలో రైతులు మళ్లీ అర్ధరాత్రి రెండు గంటలకు బయల్దేరాల్సి వచ్చింది. ఇక విధాన సభను ముట్టడించాల్సిన అవసరం లేదని, రైతుల వద్దకే ప్రభుత్వం వస్తుందంటూ అధికారులిచ్చిన మాటను రైతులు నమ్మారు. అలాగే తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదిస్తుందన్న నమ్మకంతో వారున్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top