
ఉత్తమ వర్సిటీగా హెచ్‌సీయూకు అవార్డు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’ విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైంది.
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’ విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకునిగా వ్యవహరిస్తున్న రాష్ట్రపతి ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’, ‘నవీకరణ’, ‘పరిశోధన’ విభాగాలలో వాటికి విజిటర్స్ అవార్డులు అందజేస్తారు. తక్కువ సమయంలోనే టీబీ నిర్ధారణ చేసే పరీక్షను కనుగొన్న ఢిల్లీ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు విజయ్ కే చౌదరి, డా.అమితా గుప్తాలకు ‘నవీకరణ’ విభాగంలో ఈ అవార్డు దక్కింది.
అలాగే ‘పరిశోధన’ విభాగంలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని కాస్మోలజీ, ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ గ్రూపు దీనికి ఎంపికైంది. ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో వచ్చే నెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల మూడో సమ్మేళనంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. వర్సిటీని విజిటర్స్ అవార్డుకు ఎంపిక చేయ డం హర్షణీయమని, ఈ అవార్డుతో వర్సిటీ ప్రతిష్ట మాత్రమే కాదు.. బాధ్యత కూడా మరింత పెరిగిందని హెచ్‌సీయూ వీసీ ఈ.హరిబాబు పేర్కొన్నారు.