జడ్జి కుమారుడి అవయవదానం

Gurugram Judges Son Dies Ten Days After Being Shot At By Guard - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో గాయపడిన గురుగ్రాం జడ్జి కుమారుడు పదిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. మరణించిన అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి కుమారుడి కీలక అవయవాలు గుండె, కాలేయం, మూత్రపిండాలను దానం చేసినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. గురుగ్రాం సెక్టార్‌ 49లో న్యాయమూర్తి అధికారిక సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో జడ్జి భార్య ఘటనా స్ధలంలోనే మరణించగా, తీవ్ర గాయాలైన కుమారుడిని ఆస్పత్రికి తరలించారు.

కాల్పుల ఘటన చోటుచేసుకున్న వెంటనే మహిపాల్‌ సింగ్‌గా గుర్తించిన గన్‌మాన్‌ను అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను చూసేందుకు సెలవు కావాలని గార్డు కోరగా, అందుకు నిరాకరించిన జడ్జి తన కుటుంబం షాపింగ్‌ వెళ్లేందుకు తోడుగా వెళ్లాలని సూచించారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి లోనైన సెక్యూరిటీ గార్డు గురుగ్రాం మార్కెట్‌లోని జనసమ్మర్ధం కలిగిన రోడ్డుపై పట్టపగలే తల్లీకొడుకులపై కాల్పులకు తెగబడ్డాడు. మరోవైపు హర్యానా పోలీసులు తమను వేధిస్తున్నారని నిందితుడి కుటుంబం ఆరోపించింది.

అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను చూసేందుకు మహిపాల్‌ సింగ్‌ సెలవు కోరారని వారు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మందుల చీటీని సైతం వారు చూపుతున్నారు. మహిపాల్‌ సింగ్‌ వారి ఇంట్లో పనిచేయడం లేదని, తనను సెక్యూరిటీగా కుటుంబ సభ్యులతో పంపడం ఆయనకు ఇష్టంలేదని సింగ్‌ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top