గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) కు ఇక లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)... అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలో తగిన మెజారిటీ లేని కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ బిల్లుకు ఇక లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి కావలసిన మూడింట రెండొంతుల మెజారిటీ కంటే ఎక్కువగానే ప్రభుత్వం చేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాట అధికారం చేపట్టిన అన్నాడీఎంకే తో కలిపితే మొత్తం 163 మంది రాజ్యసభ సభ్యులు జీఎస్టీ బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ప్రతిపక్ష కాంగ్రెస్ కు చెందిన 65 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కాగా, వామపక్షాలకు చెందిన 10 మంది సభ్యులు జీఎస్టీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రభుత్వం వీరితో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బిల్లును వ్యతిరేకించడానికి కావలసిన మెజారిటీ లేకపోయినా సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కు తగిన బలం ఉండటంతో కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న 18 శాతం పన్ను తగ్గింపుపై ప్రభుత్వం పునరాలోచిస్తోంది.