సోషల్‌ మీడియాకు సంకెళ్లు

Govt planning to amend IT Act to crack down on apps - Sakshi

ఐటీ చట్టం సవరణకు ముసాయిదా బిల్లు  

గత ఏడాది ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో షికార్లు చేసిన పుకార్లు.. దేశంలో పలుచోట్ల అల్లర్లు, మూక హత్యలకు అసలు కారణంగా నిలిచాయి. దీంతో సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు, పుకార్లను కట్టడిచేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదిలింది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా ఐటీ చట్టాన్ని సవరిస్తోంది. భారీగా జరిమానాలు వేసి అసత్యవార్తలు, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేసే మాధ్యమాలను నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాలకు భారత్‌లో ఖాతాదారులు చాలా ఎక్కువ. గత ఏడాది అనుభవాలతో ఇవి కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఫేక్‌ న్యూస్‌పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ, హెచ్చరిస్తూ భారీస్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. అసభ్య, అసత్య సందేశాలు, సమాచారం పంపకుండా ఖాతాదారులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాయి.

కేంద్రం హెచ్చరికలు
ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవి శంకర్‌ ఫేస్‌బుక్, వాట్సాప్‌లను హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తమ మాధ్యమం ద్వారా అనైతిక సమాచారం వ్యాప్తి కాకుండా ఫేస్‌బుక్‌ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఎన్నికల ప్రకటనలు పోస్టుచేసే వారు వారి వివరాలు, ఎక్కడ నుంచి పోస్టు చేస్తున్నారనేవి విధిగా వెల్లడించాల్సిందే.

15 కోట్ల వరకు జరిమానా
వదంతులు, అశ్లీల సమాచారాన్ని, దృశ్యాలను నియం త్రించడంలో విఫలమైన వెబ్‌సైట్లు, యాప్‌లపై భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ‘ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు’ పేరుతో ముసాయిదాను ఖరారు చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్‌ వంటి సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ సంస్థల అధిపతులతో ఐటీ శాఖ అధికారులు  సమావేశమయ్యారు. మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, వాటి జవాబుదారీతనాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. ‘అసత్య, అశ్లీల సమాచా రం సోషల్‌ మీడియాలోకి ఎక్కడ నుంచి వస్తోందో గుర్తించాలి, దాన్ని తొలగించాలి. ఈ దిశగా ప్రభుత్వం చట్టాన్ని సవరించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి’ అని ఓ ఉన్నతాధికారి అన్నారు. నిబంధలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ. 15 కోట్లు లేదా వాటి ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 4శాతం ఈ రెండింటిలో ఏది ఎక్కువయితే దాన్ని జరిమానాగా విధించాలని ప్రతిపాదించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top