రిలయెన్స్‌ మీద అంత మోజెందుకు?

Government Defends Top Billing For Jio Institute - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని మూడు ప్రముఖ ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలతోపాటు మరో మూడు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు కూడా సోమవారం నాడు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఘనత వహించిన లేదా అత్యున్నత)’ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ప్రైవేటు రంగంలో ఇంకా పురుడు కూడా పోసుకోని ‘జియో ఇనిస్టిట్యూట్‌’కు ఎలా ఈ హోదా కల్పిస్తారంటూ సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఒక్కసారిగా వెల్లువెత్తిన విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ముందుగా తికమక పడిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ‘గ్రీన్‌ ఫీల్డ్‌’ క్యాటగిరీ కింద ఇచ్చామంటూ సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ప్రభుత్వం ప్రతిపాదనల ప్రకారం దేశంలోని పది ప్రభుత్వ, పది ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు ఈ ‘అత్యున్నత’ హోదాను కల్పించాల్సి ఉంది. నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ చేపట్టగా కేవలం ఆరు అంటే, మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు మాత్రమే ఈ హోదాకు అర్హులయ్యాయని నలుగురు సభ్యుల ఎంపిక కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. గోపాలస్వామి ‘ఎకనామిక్స్‌ టైమ్స్‌’కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 500 ఉన్నత విద్యా సంస్థల్లో వరుసగా పదేళ్ల పాటు స్థానం సంపాదించిన విద్యా సంస్థలనే తాము ప్రమాణంగా తీసుకున్నామని కూడా ఆయన చెప్పారు. మరి ఏ ప్రమాణాల మేరకు ఇంకా ఏర్పాటు చేయని ‘జియో ఇనిస్టిట్యూట్‌’కు ఎలా హోదా ఇచ్చారన్న ప్రశ్నకు ఆయన ఫోన్‌ మూగబోయింది. ప్రస్తుతం ఆయన మీడియాకే అందుబాటులో లేరు.

రాజస్థాన్‌లోని పిలానిలో 1964లో ఏర్పాటైన ‘బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’కి, 1953లో ఏర్పాటైన ‘మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (కస్తూర్బా మెడికల్‌ కాలీజీని నిర్వహిస్తున్న)’తోపాటు జియో ఇనిస్టిట్యూట్‌కు ప్రభుత్వం హోదా కల్పించింది. ముకేష్‌ అంబానీ భార్య నీతా అంబానీ నేతృత్వంలో నిర్వహిస్తున్న రిలయెన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జియో ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు 2018, మార్చి నెలలో నీతూ అంబానీ ప్రకటించారు.

అసలు ప్రమాణాలు ఏమిటీ?
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2016లో తన బడ్జెట్‌ ప్రసంగంలోనే ఈ అంశాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఉన్నత విద్యను మరింత ప్రోత్సహించేందుకు 20 విద్యా సంస్థలకు ‘అత్యున్నత’ హోదా కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే 2017, ఆగస్టులో ఈ ప్రక్రియను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యా సంస్థలు బహుళ అంశాల్లో కోర్సులను నిర్వహించడమే కాకుండా పరస్పర ఆధారిత కోర్సులను కూడా నిర్వహించాలి. దేశీయ, విదేశీ విద్యార్థులకు కలిపి ఒక ఫ్యాకల్టీ తప్పనిసరిగా ఉండాలి. వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానంపై సంస్థ పరిశోధన కొనసాగుతుండాలి. విద్యార్థుల సౌకర్యాలకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండాలి. దరఖాస్తు నాటికి ప్రతి 20 విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. మరో ఐదేళ్ల కాలానికి ఆ సంఖ్య పది తగ్గాలి. ఇందులో ఏ ఒక్క ప్రమాణానికి జియో ఇనిస్టిట్యూట్‌ సరితూగదు కనుక ‘గ్రీన్‌ఫీల్డ్‌’ కేటగిరీ కింద ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

‘గ్రీన్‌ఫీల్డ్‌’ కేటగిరీ అంటే ఏమిటీ?
కేవలం ప్రైవేటురంగంలో కొత్తగా పెట్టబోయే ఉన్నత విద్యా సంస్థలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ కేటగిరీ తర్వాత తీసుకొచ్చారు. ఈ కేటగిరీ కింద సంస్థను కాకుండా యూనివర్శిటీనే ఏర్పాటు చేయాలి. అందుకు కావాల్సినంత స్థలం, డబ్బుతోపాటు విద్యారంగంలో అనుభవం ఉండాలి. సొంత పెట్టుబడులు ఐదు వేల కోట్లతోపాటు పది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల వరకు ప్రజా సంస్థల పూచికత్తు ఉండాలి. పది ప్రజా సంస్థలకు మించి ఈ పెట్టుబడులను సమకూర్చరాదు. పది వేల కోట్ల నుంచి కొంత సొమ్మును సంస్థ విస్తరణకు ఏటా ఖర్చు పెట్టాలి. ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోగా అత్యున్నత హోదాను, ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునే ఆస్కారం ఉండాలి. అందుకు తగ్గ ప్రణాళిక ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యం సమర్థుడైన వైస్‌ ఛాన్సలర్‌ ఆధ్వర్యంలో కోర్‌ కమిటీ దరఖాస్తు నాటికే నియమితులై ఉండాలి.

మరి, ఈ అర్హతలు ‘జియో’కు ఉన్నాయా?
రిలయెన్స్‌ గ్రూప్‌ కనుక కావాల్సినంత స్థలం, డబ్బు ఉండవచ్చు. అనుభవం అంటే రాజాస్థాన్‌లోని ‘బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ని చూపించవచ్చేమో! ప్రజా సంస్థల పెట్టుబడులను కూడా మేనేజ్‌ చేయవచ్చు. వైస్‌ చాన్సలర్‌ టీమ్‌ను ఏర్పాటు చేయలేదు. యూనివర్శిటీ పునాదుల మాట అటుంచి ఎక్కడ ఏర్పాటు చేయాలో కూడా నిర్ణయం జరగలేదు. మరి జియోకు ఎలా ఇచ్చారని ఈ సంస్థతో పోటీపడిన మరో హోదా దక్కించుకోని సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. దరఖాస్తు చేసిన సంస్థల్లో పెద్ద పెద్ద యూనివర్శిటీలతో సంబంధం ఉన్న, వాటిల్లో అపార అనుభవం ఉన్న సంస్థలు ఉన్నాయి. వాటికి ఒక్క ప్రజా సంస్థల పెట్టుబడులు తప్పించి, జియోకన్నా ఎక్కువ ప్రమాణాలే ఉన్నాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని దరఖాస్తుదారులు చెబుతున్నారు. సహజంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు విరాళాలిచ్చే ప్రజా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎందుకు పెట్టుబడులు పెడతాయని వారు ప్రశ్నిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top