
కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానా
బెంగళూరు: దేశరాజధానిలో 2012లో కామాంధుల చేతిలో అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన నిర్భయతో పాటు ఆమె తల్లి ఆశాదేవిపై కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానా చెత్త వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో పలు రంగాల్లో కృషిచేసిన మహిళలను సన్మానించేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆశాదేవితో కలసి పాల్గొన్న సంగ్లియానా.. ‘నేను నిర్భయ తల్లి ఆశాదేవిని చూశాను. ఈ వయసులోనే ఆమె ఇంతమంచి శరీరాకృతితో ఉందంటే.. నిర్భయ ఇంకెంత అందంగా ఉండేదో ఊహించుకోగలను’ అని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగకుండా రేపిస్టులకు దొరికిపోతే ప్రతిఘటించకుండా వారికి లొంగిపోవాలనీ, తద్వారా ప్రాణాలు నిలుపుకోవచ్చని ఆయన సదస్సుకు హాజరైన మహిళలకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో తాను ఆశాదేవి, నిర్భయలను పొగిడాననీ, ఎవ్వరినీ అవమానించలేదని సంగ్లియానా వివరణ ఇచ్చారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆశాదేవి.. వ్యక్తిగత వ్యాఖ్యలకు బదులుగా సంగ్లియానా తమ పోరాటంపై మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచనా విధానం మారలేదని తాజా ఘటన రుజువు చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.