’ఆప్’ సర్కార్ పై అప్పుడే అనుమానాలు

’ఆప్’ సర్కార్ పై అప్పుడే అనుమానాలు - Sakshi


మద్దతుపై కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు

మంత్రివర్గం ఎంపికపై ‘ఆప్’

ఎమ్మెల్యేల్లోనూ లుకలుకలు

ప్రజల కోరిక మేరకే అధికారాన్ని చేపడుతున్నామన్న కేజ్రీవాల్


 న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఇంకా పగ్గాలు చేపట్టక ముందే దాని మనుగడపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడ్డ ‘ఆప్’ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్, మంగళవారం తన మంత్రివర్గాన్ని ఖరారు చేశారు. తన సన్నిహితులైన ఆరుగురు నేతలకు మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రివర్గం ఎంపికపై ‘ఆప్’ ఎమ్మెల్యేల్లో లుకలుకలు మొదలయ్యాయి. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రివర్గాన్ని ప్రకటించగా, అందులో తనకు చోటు దక్కనందుకు కినుక వహించిన ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ అర్ధంతరంగానే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. బయట ఉన్న మీడియా ప్రతినిధులతో బిన్నీ మాట్లాడుతూ, బుధవారం తాను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నానని, అది పార్టీకి ఇబ్బందికరంగా ఉండవచ్చని చెప్పారు. మరోవైపు, ప్రభుత్వం ఏర్పాటు కోసం ‘ఆప్’కు మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్‌లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ‘ఆప్’కు మద్దతివ్వాలన్న నిర్ణయం సరైనది కాదని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ మీడియాతో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా పట్టించుకోకుండా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైతే బాగుండేదన్నారు. అయితే, పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నందున ఇక అందుకు అనుగుణంగానే నడుచుకోవాలన్నారు. ‘ఆప్’కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఎదుట వరుసగా రెండోరోజూ ధర్నాకు దిగారు. మద్దతును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ, కేజ్రీవాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేశాక గత కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో అవినీతికి పాల్పడిన మంత్రులపై చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ ప్రకటించారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా, మంత్రివర్గంలో ఆ పార్టీ వారెవరికీ చోటు కల్పించబోమని చెప్పారు.


ఢిల్లీలోని 26 లక్షల మంది ప్రజల మనోగతాన్ని తెలుసుకున్న తర్వాతే ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 18 హామీల అమలుకు ప్రాధాన్యమిస్తామని, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటున్నా, సొంత ఎజెండాతోనే పరిపాలన కొనసాగిస్తామని చెప్పారు. కేజ్రీవాల్, ఆయన సహచర మంత్రులు ఈనెల 26న రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రామ్‌లీలా మైదానం వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే జనలోక్‌పాల్ బిల్లు కోసం ఈ మైదానంలో చేపట్టిన నిరసన దీక్షతోనే ఆయన శిష్యునిగా కేజ్రీవాల్ ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజారే హాజరు కావడం లేదు. ఇంతవరకు ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని, తన ఆరోగ్యం సహకరించడం లేదని, ఒకవేళ ఆహ్వానం అందినా, కార్యక్రమానికి హాజరు కాలేనని హజారే మీడియాతో చెప్పారు. అయితే, 26న తాను కేజ్రీవాల్‌తో మాట్లాడతానన్నారు. కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అస్మదీయులకే చోటు: కేజ్రీవాల్ తనకు అత్యంత విశ్వసనీయుడైన మాజీ జర్నలిస్టు మనీష్ సిసోడియాతో పాటు తనకు అస్మదీయులైన మరో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. వారిలో పీడబ్ల్యూడీ మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించిన రాఖీ బిర్లా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి కిరణ్ వాలియాను ఓడించిన సోమ్‌నాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోనీ, సత్యేంద్ర జైన్ ఉన్నారు. వీరిలో అత్యధికులు పిన్న వయస్కులే కావడం గమనార్హం. మంత్రుల ఎంపిక ముఖ్యమంత్రి విచక్షణాధికారంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుందని, పార్టీలో అసమ్మతి ఏమీ లేదని సిసోడియా మీడియాతో చెప్పారు. అయితే, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై ఢిల్లీ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేపథ్యం నుంచి వచ్చిన వినోద్‌కుమార్ బిన్నీ కినుక వహించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఆయనను బుజ్జగించేందుకు యోగేంద్ర యాదవ్ సహా పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపాయి. ఎన్నికల్లో బిన్నీ ఆరోగ్యశాఖ మంత్రి ఏకే వాలియాను ఓడించారు. అయితే, బిన్నీకి కీలకమైన స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, తన సమవయస్కుడైన రాజేంద్రకుమార్‌ను సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమించాలని కేజ్రీవాల్ నిర్ణయించి నట్లు తెలుస్తోంది. రాజేంద్రకుమార్ కూడా కేజ్రీవాల్ మాదిరిగానే ఖరగ్‌పూర్ ఐఐటీలో చదివారు. రాజేంద్రకుమార్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియా కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. సీఎం బంగ్లాను నిరాకరించిన కేజ్రీవాల్... తనకు జెడ్ కేటగిరీ భద్రత వద్దని ఇప్పటికే చెప్పిన కేజ్రీవాల్, తాజాగా ముఖ్యమంత్రి బంగ్లాను స్వీకరించేందుకు కూడా నిరాకరించారు. తనను కలుసుకున్న ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పోలియాకు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వీఐపీ సంస్కృతిని అంతం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, మిగిలిన మంత్రులు కూడా అధికారిక నివాసాలను స్వీకరించబోరని నేతలు చెబుతున్నారు.

 విద్యుత్ చార్జీల తగ్గింపుపై ప్రకటన!  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేజ్రీవాల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీల తగ్గింపుపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రైవేట్ విద్యుత్ సరఫరా సంస్థల అకౌంట్లను తనిఖీ చేయడంతో పాటు విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు ఎన్నికల సమయంలో ‘ఆప్’ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
 కేజ్రీవాల్ టీమ్...     మనీష్ సిసోడియా (41): మాజీ జర్నలిస్టు. ప్రతాప్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై 11,478 ఓట్లతో విజయం సాధించారు. జర్నలిజంలో డిప్లొమా చేసిన సిసోడియా స్వస్థలం యూపీలోని హాపూర్ జిల్లా.

     సౌరభ్ భరద్వాజ్ (34): కంప్యూటర్ ఇంజనీర్. గ్రేటర్ కైలాస్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత వీకే మల్హోత్రా తనయుడు అజ య్ మల్హోత్రాపై 13,092 ఓట్లతో గెలుపొందా రు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన భరద్వాజ్ ఇంద్రప్రస్థ వర్సిటీ నుంచి బీటెక్, ఉస్మానియా వర్సి టీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీలు చేశారు.

     సోమ్‌నాథ్ భారతి (39): బీహార్‌కు చెందిన భారతి 1992లో ఢిల్లీ చేరుకుని ఇక్కడే స్థిరపడ్డారు. మాలవ్యనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆర్తీ మెహ్రా, కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియాలపై గెలుపు సాధించారు. ఐఐటీ-ఢిల్లీలో ఎమ్మెస్సీ, ఢిల్లీ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు.

     రాఖీ బిర్లా (26): మాజీ జర్నలిస్టు. కేజ్రీవాల్ బృందంలో పిన్నవయస్కురాలైన రాఖీ, నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అకాడమీ నుంచి జర్నలిజం లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. మంగోల్‌పురి స్థానం నుంచి మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌పై 10,585 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

     సత్యేంద్ర జైన్ (49): వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఎక్కువగా కేంద్ర ప్రజా పనుల శాఖ పనులు చేసేవారు. షాకుర్ బస్తీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్యామ్‌లాల్ గార్గ్‌పై 7,062 ఓట్ల తేడాతో గెలుపొందారు.

     గిరీశ్ సోనీ (49): వ్యాపారవేత్త. మాదీపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాస్ సంక్లాపై 1,103 ఓట్ల తేడాతో గెలుపొందారు. పన్నెండో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సోనీకి మాదీపూర్‌లో తోలు వస్తువుల వ్యాపారం ఉంది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top