మధ్యవర్తిత్వం చేస్తా

Donald Trump Offers To Mediate Border Dispute Between India And China - Sakshi

భారత్, చైనా సరిహద్దు వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌

భారత్‌తో దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుగుతున్నాయన్న చైనా

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/బీజింగ్‌: భారత్, చైనా సరిహద్దు వివాదంలోకి అనూహ్యంగా అమెరికా వచ్చి చేరింది. లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్‌– చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ప్రకటించారు. కశ్మీర్‌ అంశంలోనూ భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ గతంలో ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కశ్మీర్‌ విషయంలో మూడో జోక్యాన్ని అంగీకరించబోమని భారత్‌ తేల్చిచెప్పింది.

‘ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తిగా, సిద్ధంగా ఉన్నాం. మధ్యవర్తిత్వం వహించే సామర్థ్యం కూడా మాకుంది. ఈ విషయాన్ని భారత్, చైనాలకు తెలియజేశాం’ అని ట్రంప్‌ బుధవారం తెల్లవారుజామున ఒక ట్వీట్‌ చేశారు. భారత్‌ సరిహద్దుల్లో చైనా తరచూ ఘర్షణలకు దిగుతోందని, యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోందని గతవారం అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సీనియర్‌ దౌత్యవేత్త అలిస్‌ వెల్స్‌ ఆరోపించారు. చైనా దూకుడుకు అంతేస్థాయిలో అడ్డుకట్ట వేయాలని కూడా ఆమె భారత్‌కు సూచించారు.

పదవీ విరమణకు కొన్నిరోజుల ముందు మే 20న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ మర్నాడే చైనా స్పందించింది. ఆ వ్యాఖ్యలను నాన్సెన్స్‌ అని కొట్టేసింది. వివాద పరిష్కారానికి దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. వాస్తవాధీన రేఖగా పేర్కొనే సరిహద్దుకు సంబంధించి భారత్, చైనాల మధ్య చాన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇటీవల లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో సరిహద్దుల వెంట ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు సరిహాద్దుల్లో బలగాలను, మౌలిక వసతులను భారీగా పెంచుకుంటున్నాయి.

ప్రశాంతంగానే పరిస్థితి
భారత్‌తో సరిహద్దు వివాదం విషయంలో చైనా బుధవారం కొంత సంయమన ధోరణిలో స్పందించింది. భారత్‌తో సరిహద్దుల వెంబడి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని వ్యాఖ్యానించింది. ‘భారత్‌ సరిహద్దుల్లో మొత్తానికి పరిస్థితి స్థిరంగా, నియంత్రణలోనే ఉంది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్‌ ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. ‘చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన దౌత్య, సమాచార వ్యవస్థ ఇరుదేశాల మధ్య ఉంది’ అన్నారు. ఆయా మార్గాల ద్వారా వివాదాలను ఇరుదేశాలు పరిష్కరించుకోగలవన్నారు. ప్రస్తుత వివాదానికి సంబంధించి భారత్‌తో దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

ఏ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్న ప్రశ్నకు.. దౌత్య మార్గాల్లో, సరిహద్దుల్లోని బలగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ ఇరుదేశాల మధ్య ఉందన్నారు. సరిహద్దు విషయాలకు సంబంధించి చైనా స్పష్టమైన ధోరణితో ఉందన్నారు. ‘రెండు దేశాల నేతల సమక్షంలో కుదిరిన ఏకాభిప్రాయానికి, రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాం’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య జరిగిన అనధికార భేటీలను ప్రస్తావిస్తూ జావొ వ్యాఖ్యానించారు. యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలంటూ తమ ఆర్మీని జిన్‌పింగ్‌ ఆదేశించిన మర్నాడే ఆ దేశ విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top