
ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు అధికారి ఆత్మహత్య కలకలం రేపింది. వేగంగా దూసుకువస్తున్న మెట్రో రైలు ముందు దూకి ఏఎస్‌ఐ అజయ్ కుమార్ ప్రాణం తీసుకున్నారు. జహంగీర్‌పురి మెట్రో స్టేషన్‌లో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు మెట్రో సేవలకు అంతరాయం కలిగింది.
మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బంది అందించిన సమాచారం రైలు వచ్చిన వెంటనే అక్కడే ఉన్న అజయ్ అకస్మాత్తుగా రైలుకిందికి దూకేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. అలాగే సంఘటనా స్థలంలోఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదనీ, విచారణ ప్రారంభించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌కుచెందిన అజయ్ కుమార్ ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ దాకా మెడికల్ లీవ్‌లో ఉన్న ఆయన మరో నెలరోజుల పాటు సెలవును పొడిగించుకున్నారు. ఈ నేపథ్యంలో అజయ్‌కుమార్ రోజు (ఏప్రిల్ 4వ తేదీ) తిరిగి విధుల్లో చేరాల్సి వుంది.