ఈ పిల్లలు హత్యాయత్నం చేశారట!

Dalit Boys as Young as 12 Languish in Yogi's Jails on Attempt to Murder Case - Sakshi

యోగీ పాలనలో జైలుపాలవుతోన్న పసిపిల్లలు

యోగీ ఆదిత్యనాథ్‌ పాలన  ఉత్తర ప్రదేశ్‌ లో దళిత కుటుంబాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పట్టుమని పన్నెండేళ్ళు కూడా నిండని తమ పిల్లలు కేవలం దళితులు అయిన నేరానికి గత రెండు నెలలుగా జైళ్ళలో మగ్గిపోతున్నారని దళిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరెస్టు చేసే ముందు నువ్వు చమర్‌వా? లేక జాతవా? అని ప్రశ్నించి మరీ అరెస్టు చేసినట్టు వారారోపిస్తున్నారు. 

‘‘నా కొడుకు సచిన్‌. సెయింట్‌ దేవ్‌ఆశ్రమంలో చదువుకొంటున్నాడు. కోచింగ్‌ క్లాసుల గురించి తెలుసుకునేందుకు బయటకెళ్ళిన 15 ఏళ్ళ నా కొడుకుని పట్టుకుని జైల్లో పెట్టారు.’’సచిన్‌ తండ్రి 62 ఏళ్ళ ధర్మవీర్‌ సింఘ్‌ ఆవేదన ఇది. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో ఎటువంటి విచారణ లేకుండా నేరుగా అరెస్టులు చేసే అధికారాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా దళిత సంఘాల నేతృత్వంలో ఏప్రిల్‌ 2 న ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో చెలరేగిన హింసలో పన్నెండు పదమూడేళ్ళ బాలురు ముగ్గురిపై యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పదిహేను సెక్షన్లకింద వివిధ నేరాలు మోపి, గత రెండు నెలలుగా అమాయకులైన వారిని అన్యాయంగా జైల్లో నిర్బంధించినట్టు ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. భారత్‌ బంద్‌ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో హింస చెలరేగింది. అది పోలీస్‌ ఫైరింగ్‌కి దారితీసిన విషయం తెలిసిందే. 

మా పిల్లలు చేసిన నేరమల్లా దళితులుగా పుట్టడమే నంటాడు ధర్మవీర్‌. చదువుకొని మమ్మల్నాదరిస్తాడనుకుంటే ఇలా జైల్లో మగ్గిపోతున్నాడని ఆవేదన చెందుతున్నారు ధర్మవీర్, అతని భార్య రామేశ్వరి. బాలనేరస్తులకోసం కేటాయించిన జువైనల్‌ హోంలో కాకుండా మీరట్‌ జైల్లో పెద్ద పెద్ద నేరగాళ్ళ సరసన సచిన్‌ని ఉంచారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ ఆధార్‌కార్డుని, స్కూల్‌ స్టేట్‌మెంట్‌ని పోలీసులకు చూపించినా జువైనల్‌ హోంకి పంపేందుకు వాళ్ళు నిరాకరించారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా కలియాగరి, సరైకాజి దళితవాడల్లో కుటుంబాలను ఈ అరెస్టులు కలవరపెడుతున్నాయి. సరైకాజికి చెందిన రోష్ని కొడుకు పన్నెండేళ్ళ అజయ్‌ది కూడా ఇదే కథ.  ఐదో తరగతి చదువుతున్న అజయ్‌ని సైతం పోలీసులు వదిలిపెట్టలేదు. ఏప్రిల్‌ 2వ తేదీన మందులు తెస్తానని తల్లికి చెప్పి వెళ్ళిన అజయ్‌ రెండు రోజులు ఏమయ్యాడో తెలియదు.

వికలాంగురాలైన అజయ్‌ తల్లి రోష్ని చివరకు తన కొడుకు ఆచూకీ తెలుసుకుని జైలుకెళ్లింది. అజయ్‌ని సైతం అరెస్టు చేసే ముందు నువ్వు చమర్‌వా అని ప్రశ్నించినట్టు రోష్ని వివరించారు. 12 ఏళ్ళు కూడా నిండని నా కొడుకు ఇంత పెద్ద నేరాలకు ఎలా పాల్పడతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. చేయని నేరానికి చిన్న పిల్లలను అరెస్టు చేయడమే కాకుండా, వారిని కలవడానికెళ్ళిన వారిని కూడా జైల్లో పడేస్తామని బెదిరిస్తున్నట్టు ఆమె ఆరోపించారు. పై అధికారులనుంచి తమకు ఆదేశాల్లేవంటూ రెండు నెలలుగా చిన్నపిల్లలను వదలిపెట్టడంలేదన్నారామె. కలియాగరీ కి చెందిన 35 ఏళ్ళ సుందరి, నానక్‌ చంద్‌ల పన్నెండేళ్ళ కొడుకు అభిషేక్‌ ని సైతం ఏప్రిల్‌ 2వ తేదీన చౌదరి చరన్‌ సింఘ్‌ యూనివర్సిటీ దగ్గర మంచినీళ్ళు తాగుతున్నవాడిని తాగుతున్నట్టే అరెస్టు చేసారు. ఈ బాలుడిని కూడా అరెస్టు చేసే ముందు కులం గురించి ఆరాతీసారు. ప్రస్తుతం జువైనల్‌ జైల్లో పెట్టినా లాకప్‌లోనే తన కొడుకుని రోజూ కొట్టేవారనీ అభిషేక్‌ తల్లిదండ్రులు చెప్పారు. కులం అడిగి మరీ తనను అరెస్ట్‌ చేసినట్టు అభిషేక్‌ తల్లిదండ్రులకు వివరించాడు. 

ఐపిసి 147, 149, 332, సెక్షన్‌ 353, 336, 435, చివరికి హత్యాయత్నం 307, సెక్షన్‌ 395 దోపిడీ నేరం, శాంతిని భగ్నం చేసినవారిపై పెట్టే 504, సెక్షన్‌ 120(బి)కుట్ర, సెక్షన్‌ 427లకు తోడు తీవ్రమైన నేరారోపణలు సెక్షన్‌ 7, ఐపిసి 1932 యాక్టు, 1984(4) ప్రివెన్షన్‌ ఆఫ్‌ డామేజింగ్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ యాక్ట్‌ లాంటి తీవ్రమైన నేరాలను ఈ ముగ్గురు మైనర్‌ బాలురపైనా మోపారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం వీరి వయస్సుని ఎక్కువగా చూపించి దాదాపు 15 రకాల సెక్షన్లకింద అందరిపైనా ఒకేరకమైన నేరాలను మోపడం ఈ కేసులోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోందని వీరి తరపు  న్యాయవాది సతీష్‌కుమార్‌ వాదిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top