మావోయిస్టు ఉద్యమం.. ఆసక్తికర సమాచారం

CRPF latest data tells that Red Corridor significantly reducing - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి ఇటీవల వెల్లడైన సమాచారం చర్చనీయాంశమైంది. మావోయిస్టు ఉద్యమకారులకు గట్టి పట్టున్న ‘రెడ్‌ కారిడార్‌’ క్రమంగా కుచించుకుపోతున్నదని, ఒకప్పుడు 100కుపైగా జిల్లాలను ప్రభావితం చేసిన ఉద్యమం.. నేడు 58 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని సీఆర్పీఎఫ్‌ ధృవీకరించిన నివేదికలో తేలింది. డ్రోన్ల వంటి ఆధునిక పరికరాలు, రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్‌తో చేపట్టే ప్రతివ్యూహాలు, పగలూ, రాత్రి తేడాలేకుండా సాగించిన ఆపరేషన్లు, ఇన్ఫార్మర్‌ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ టాప్‌ లీడర్లను టార్గెట్‌ చేయడం.. తదితర వ్యూహాలతో బలగాలు సమిష్టిగా పనిచేస్తున్నందునే తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలోని అంశాలపై సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రాయ్‌ భట్నాగర్‌ మీడియాతో మాట్లాడారు.

డౌన్‌ ఫాల్‌.. : ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా, బిహార్‌లలోని అతికొద్ది జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని, హింసకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో 90 శాతం ఆ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని రిపోర్టులో తెలిపారు. 2015నాటికి 75 జిల్లాల్లో బలంగా ఉండిన మావోయిస్టులు.. 2016 వచ్చేసరికి 67 జిల్లాలకు కుచించుకుపోగా, 2017 చివరినాటికి ఆ సంఖ్య 58 జిల్లాలకు పడిపోయింది. ఉద్యమాన్ని అణిచివేయడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో దశాబ్ధాల కిందటే కేంద్ర బలగాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. నక్సల్స్‌ ఏరివేత ఆపరేషన్లలో ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ బలగాలు పాలుపంచుకుంటున్నాయని, ఆయా శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని, అదే సమయంలో ప్రభుత్వాలు.. రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, మారుమూల ప్రాంతాల్లో పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు తదితర పనులను శరవేగంగా చేపడుతున్నాయిన, అందుకే తీవ్రవాదం క్రమక్రమంగా బలహీనపడుతున్నదని సీఆర్పీఎఫ్‌ డీజీ భట్నాగర్‌ చెప్పుకొచ్చారు.

ఆ మూడు ప్రాంతాలు.. : మావోయిస్టు ఉద్యమాన్ని పారదోలే క్రమంలో కేంద్ర బలగాలకు తోడు రాష్ట్రాల పోలీసులు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని, బయటి నుంచి ఆయుధాలు చేరకుండా అడ్డుకోగలుగుతున్నామని, నిధుల ప్రవాహం కూడా దాదాపు క్షీణించిందని రిపోర్టులో వెల్లడైంది. ‘‘తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి 2017లో మేం చాలా సాధించగలిగాం. నక్సల్స్‌ స్థావరాల్లోకి చొచ్చుకుపోగలిగాం. ప్రస్తుతం మా దృష్టంగా మావోయిస్టు అగ్రనాయకత్వంపైనే ఉంది. 1200 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న బస్తర్‌-సుక్మా రీజియన్‌, 2000చ.కి.మీల ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌(ఏవోబీ), దాదాపు 4500 చ.కి.మీల అబూజ్‌మడ్‌ అడవులు.. ఈ మూడు ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టులు మనగలుగుతున్నారని, భద్రతాపరమైన సమస్యల కారణంగా ప్రభుత్వ సిబ్బంది అక్కడికి వెళ్లలేకపోతున్నారు’’ అని భట్నాగర్‌ తెలిపారు.

యాక్షన్‌ ప్లాన్‌ 2017-2022? : గత ఏడాది కేంద్ర బలగాలు నిర్వహించిన ఆపరేషన్లలో సుమారు 150 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 30 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల వ్యూహాలకు సంబంధించి ‘2017-2022 యాక్షన్‌ ప్లాన్‌’ పేరుతోఉన్న కీలక పత్రాలు లభ్యమైనట్లు తెలిసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top