మాస్కు లేదని సీఆర్‌పీఎఫ్‌ కమాండోను..

CRPF Commando Allegedly Chained At Karnataka Police Station For Not Wearing Mask - Sakshi

బెంగళూరు : లాక్‌డౌన్‌ నియమ నిబంధనలను ఉల్లంఘించాడని ఆరోపిస్తూ  సీఆర్‌పీఎఫ్‌ చెందిన ఓ కోబ్రా కమాండోపై కర్ణాటక పోలీసులు విచక్షణా రహితంగా ప్రవరించారు. మాస్కు‌ ధరించలేదన్న కారణంతో అతన్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి గొలుసులతో కట్టేశారు. కర్ణాటకలోని బెళగావి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
(చదవండి : భారీ ఊరట : వారి నుంచి వైరస్‌ సోకదు..)

వివరాలు.. బెళగావి జిల్లా చిక్కోడి తాలుకా ఎక్సాంబ ప్రాంతంలో సచిన్ సావంత్ అనే యువకుడు సీఆర్ పీఎఫ్ లో కోబ్రా కమాండోగా పని చేస్తున్నారు. సెలవుల నిమిత్తం సొంతూరుకు వచ్చిన సచిన్‌.. లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయారు.  ఇంటి దగ్గరే ఉన్న సచిన్ సావంత్  మాస్కు లేకుండా బయటకు వచ్చి  బైక్ ను నీటితో శుభ్రం చేస్తున్నారు.  ఇది గమనించిన పోలీసులు.. అతని దగ్గరికి వెళ్లి మాస్కు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు.
(చదవండి : హాట్సాఫ్‌! మహిళా పోలీసుల కొత్త అవతారం)

ఈ క్రమంలో సచిన్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లో గొలుసులతో కట్టేశారు. గొలుసులతో మూలకు కూర్చున్న సచిన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో  వైరల్‌ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తితో ఇలాగేనా వ్యవహరించేది అంటూ కర్ణాటక పోలీసులను తీరుపై మండిపడ్డారు. అటు, సీఆర్పీఎఫ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై తాము కర్ణాటక పోలీస్ చీఫ్ తో మాట్లాడామని, కమాండోకు బెయిల్ కోసం స్థానికంగా ఉన్న తమ అధికారితో పిటిషన్ వేయించామని సీఆర్పీఎఫ్ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top