కరోనా : ఉద్యోగం కంటే సేవ చేయడమే బాగుంది

Coronavirus : Salute To Government Employee Who Working 14 Hours Per Day - Sakshi

ఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ప్రం​ హోం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ నిత్యం ఉరుకుల పరగుల జీవితంలో ఉండే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం వెసులుబాటు కల్పించడంతో ఇంట్లోనే ఉంటూ తమ పని చేయడమే గాక సురక్షితంగా ఉండొచ్చు అని భావిస్తారు. అయితే ఢిల్లీకి చెందిన రవి చంద్రన్‌ మాత్రం ఉద్యోగం కంటే సమాజసేవ చేయడమే ముఖ్యమని పేర్కొంటున్నాడు.

రవి చంద్రన్‌.. ఢిల్లీలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌లో అసిస్టెంట్‌ స్క్రుటిని ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు తన ఇంటి నుంచి నార్త్‌ డిల్లీలోని విధాన సభకు పక్కనే ఉన్న బిల్డింగ్‌లో విధులు నిర్వహించేవాడు. రోజు 8గంటల పాటు పనిచేసి మెళ్లిగా ఇంటికి చేరుకునేవాడు. ఇది అతని జీవితంలో రెగ్యులర్‌గా జరిగే పని. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రసుతం అతను పని చేస్తున్న ఆఫీస్‌కు కొన్ని రోజులు సెలవులు ఇవ్వడంతో ఇంట్లోనే ఉంటున్నాడు.

అయితే తనకు మాత్రం ఉద్యోగం లేకపోతే సమాజసేవ చేయడమే చాలా ఇష్టమంటున్న రవి చంద్రన్‌ను చూడాలంటే మాత్రం ఉత్తర ఢిల్లీలోని ఘాజీపూర్‌లోని గవర్నమెంట్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో కనిపిస్తాడు. ఇటువంటి ఆపత్కాల సమయంలో రోజుకు 14గంటల పాటు విధుల నిర్వహిస్తూ అందరిచేత శెభాశ్‌ అనిపించుకుంటున్నాడు. మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ఈ స్కూల్‌ను ఇప్పుడు వలసదారుల సహాయ శిబిర కేంద్రంగా మార్చారు. దీనికి ఇప్పుడు రవి చంద్రన్‌ వార్డెనర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒక చిన్న షెడ్‌ వేసుకొని అందులోనే ఒక టేబుల్‌, కుర్చీ ఏర్పాటు చేసుకున్నాడు.  దాదాపు 400 మందికి పైగా ఉంటున్న ఈ శిబిరంలో వారికి అందవలసిన సామాగ్రితో పాటు , తినే ఆహారం నుంచి వారంతా సామాజికి దూరం పాటించే వరకు ప్రతీ విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అయితే ఇదే విషయమై రవి చంద్రన్‌ను అడిగితే.. 'ఇటువంటి పరిస్థితి నా జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి చూడలేదు. ఇలాంటి విపత్కర సమయంలో నేను ఖాళీగా ఉండలేను. నాకు తోచినంత సహాయం చేయడానికి ఎప్పుడు మందుంటాను. నేను ఎంత గొప్ప పని చేసినా ఇంకా సాధించాల్సింది ఏదో ఉంది అని ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు వార్డెనర్‌గా విధులు నిర్వహిస్తున్న దగ్గర చాలామందికి డబ్బులు లేవు. ఇప్పుడు ఉన్నపళంగా వారిని అ‍క్కడినుంచి పంపిచేస్తే వారంతా దిక్కులేని వారవుతారు. అందుకే మార్చిలో వచ్చిన జీతం నుంచి కొంచెం పక్కకు తీసి వారికి చేతనైనంత సహాయం చేస్తున్నాను.

ఇప్పుడు కూడా నా మిత్రులు, తెలిసినవారి దగ్గరికి వెళ్లి కొంత డబ్బు అడుగుతున్నాను. ఇప్పుడు సహాయ కేంద్రాలలో ఉంటున్నవారు లాక్‌డౌన్‌ ముగిశాక తమ ఇళ్లకు వెళ్లే ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి 500 నుంచి వెయ్యి రూపాయలు అందిస్తాను. ఈ మధ్యనే నాకు తెలిసిన కొంతమంది డబ్బులు పోగేసుకొని దాదాపు 450 మాస్కులు అందజేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేసే పని కంటే 14 గంటల పాటు సమాజసేవ చేస్తున్నందుకు నా భార్య ఎంతో సంతోషిస్తుంది. కష్టకాలంలో ఇంతమందికి సహాయపడడం కంటే నా జీవితంలో ఆనందం ఏముంటుందంటూ' రవి చంద్రన్‌ చెప్పుకొచ్చాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top