భర్త బలత్కారాన్ని రేప్గా పరిగణించలేం | Considered as rape and raped by husband | Sakshi
Sakshi News home page

భర్త బలత్కారాన్ని రేప్గా పరిగణించలేం

Apr 30 2015 2:28 AM | Updated on Jul 28 2018 8:51 PM

భర్త బలత్కారాన్ని రేప్గా పరిగణించలేం - Sakshi

భర్త బలత్కారాన్ని రేప్గా పరిగణించలేం

మహిళ సమ్మతి లేకుండా... ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది నేరమే. రేప్ కిందకే వస్తుంది.

 దీన్ని నేరంగా చేసే
 ప్రతిపాదనేమీ లేదు: కేంద్రం
 అంతర్జాతీయ నిర్వచనం వేరు
 భారత సమాజ స్థితిగతులు వేరు

 
అంతర్జాతీయంగా..
మహిళ సమ్మతి లేకుండా... ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది నేరమే. రేప్ కిందకే వస్తుంది. అది పెళ్లాడిన భర్త కావొచ్చు, సహజీవనం చేస్తున్న వ్యక్తి కావొచ్చు, ప్రేమికుడు లేదా ఇంకెవరైనా కావొచ్చు.
 
కనిమొళి ప్రశ్న..
భర్త బలవంతంగా అనుభవించినా (మారిటల్ రేప్) అది రేప్ కాదనే మినహాయింపు ఐపీసీలోని 375 సెక్షన్‌లో ‘రేప్’ నిర్వచనంలో ఉంది. దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా? మహిళలపై వివక్షను అంతమొందించేందుకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి... భారత్ ఈ మేరకు చట్ట సవరణ చేయాలని, మారిటల్ రేప్‌ను నేరంగా చేయాలని సూచించింది నిజమేనా?
 
భార్యకు ఇష్టం లేకున్నా, ఆమె సమ్మతి లేకుండా బలవంతపెట్టి శారీరకంగా కలిస్తే అది విదేశాల్లో నేరమే. రేప్ కిందకే వస్తుంది. అయితే అంతర్జాతీయంగా దీనికి నిర్వచనం వేరని, భారత్‌లో నెలకొన్న భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని మనదేశంలో రేప్‌గా నిర్వచించలేమని, అలాంటి ఆలోచనేమీ లేదని కేంద్ర ప్రభుత్వం  రాజ్యసభలో బుధవారం స్పష్టం చేసింది. రాజ్యసభలో డీఎంకే ఎంపీ కనిమొళి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి సమాధానమిస్తూ... భర్తలకు మినహాయింపునిస్తున్న ఐపీసీలోని 375ని సవరించే యోచనేదీ లేదన్నారు.

  • భారత్‌లో 75 శాతం మంది మహిళలు భర్తల చేతిలో  బలాత్కారాలకు గురవుతున్నారని ఐరాస పాపులేషన్ ఫండ్ చెప్పిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా?
  • మంత్రి సమాధానం: మారిటల్ రేప్‌ను భారత్ లాంటి సమాజంలో నేరంగా చేయలేం. ఇక్కడ పెళ్లిని పవిత్రమైనదిగా పరిగణిస్తాం.
  • మన సమాజంలో అక్షరాస్యత శాతం, పేదరికం, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, విలువలు, మతపరమైన విశ్వాసాలు ఉన్నాయి. ఇలాంటి సమాజంలో భర్త బలవంతాన్ని నేరంగా పరిగణించాలనే డిమాండ్‌ను అమలుచేయడం అంత సులభం కాదు.
  • రేప్ సంబంధిత చట్టాలను సమీక్షించి 172వ నివేదిక సమర్పించినపుడు లా కమిషన్ కూడా భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించాలని సిఫారసు చేయలేదు.  అందువల్ల చట్టాన్ని సవరించే ప్రతిపాదనేమీ లేదు.
  •  మహిళలపై వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటైన ఐరాస కమిటీ మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని భారత్‌కు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి కూడా. దీన్ని మంత్రి స్వయంగా అంగీకరించారు.
  •  నిర్భయ ఉదంతం తర్వాత ఏర్పాటైన జస్టిస్ జె.ఎస్.వర్మ కమిటీ మారిటల్ రేప్‌కు ఉన్న మినహాయింపు తొలగిస్తూ ఐపీసీని సవరించాలని సిఫారసు చేసింది. అయితే ప్రభుత్వం దీనిని ఆమోదించలేదు.
  •  మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే అమలు చేసేటపుడు ఎన్నో సమస్యలు తలెత్తుతాయని హోంశాఖ అభిప్రాయపడింది. భారత్‌లో కుటుంబ విలువలకు ఇది విఘాతమని పేర్కొంది. పెళ్లి చేసుకోవడం అంటేనే సమ్మతిగా మన సమాజం పరిగణిస్తుందంది. క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2012పై ఏర్పాటైన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆనాడు హోంశాఖ అభిప్రాయంతో ఏకీభవించింది.

    దుమారం రేగుతుంది: అన్ని రంగాల్లో సమాన హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహిళా సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. కేంద్ర ప్రభుత్వంపై దేశం లోపలా, అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement