
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శివకుమార్ (పాత ఫొటో)
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కనకపుర నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆయన పేరిట, భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువ 730 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. శివ కుమార్ ప్రస్తుతం కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.
2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన తన ఆస్తుల విలువ 251 కోట్లు రూపాయలుగా పేర్కొన్నారు. ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ దాదాపుగా మూడు రెట్లు పెరగడం గమనార్హం. వీటిలో బ్యాంకులో అందుబాటులో ఉన్న నగదు విలువ 95 కోట్ల రూపాయలు కాగా, బంగారం, వజ్రాలు, వెండిల విలువ కోటిన్నర రూపాయలు.
ఇతర ఆస్తుల విలువ 635.8 కోట్ల రూపాయలు. తన కూతురు ఐశ్వర్య ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలని కూడా శివ కుమార్ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. 2017లో పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు శివ కుమార్ సంస్థలపై దాడులు నిర్వహించారు.
100 మందికి పైగా ఐటీ శాఖ అధికారులు చెన్నై, ఢిల్లీ, కర్ణాటకల్లోని శివ కుమార్ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో కొన్ని డాక్యుమెంట్లను, కొంత డబ్బును సీజ్ చేశారు కూడా. గత నెలలో శివ కుమార్‌కు ప్రత్యేక కోర్టు షరతులతో కూడా బెయిల్‌ను మంజూరు చేసింది.