
సీబీఐకి సహకరించండి: సుప్రీంకోర్టు
బొగ్గు గనుల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తుకు సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనుల లెసైన్సులను ఎలా జారీ చేశారనే అంశానికి సంబంధించిన సమాచారం,
‘కోల్‌గేట్’లో కేంద్రానికి ‘సుప్రీం’ నిర్దేశం
సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: బొగ్గు గనుల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తుకు సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనుల లెసైన్సులను ఎలా జారీ చేశారనే అంశానికి సంబంధించిన సమాచారం, అవసరమైన పత్రాలను ఎలాంటి జాప్యం లేకుండా సీబీఐకి అందించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు కూడా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
ఈ నెల 25వ తేదీ వరకూ పూర్తయిన దర్యాప్తుకు సంబంధించి తాజా స్థాయీ నివేదికను 29వ తేదీన తనముందు ఉంచాల్సిందిగా సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. సీనియర్ అధికారులను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కావాలన్న కేంద్రం వైఖరిని మరోసారి ప్రశ్నించింది. ప్రభుత్వ పాత్రపైనే ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఈ దర్యాప్తులో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలని నిలదీసింది. తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న దర్యాప్తులో అధికారుల విచారణకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించింది.