ఇదో ఘోర తప్పిదం

Chidambaram Says This is a terrible mistake about Article 370 - Sakshi

జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పి.చిదంబరం తీవ్రస్థాయిలో బీజేపీపై మండిపడ్డారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఘోర తప్పిదానికి పాల్పడిందని, ఇదొక చట్టపరంగా తీసుకున్న ప్రమాదకర నిర్ణయమని ఆరోపణలు చేశారు.

బీజేపీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ను చిన్నాభిన్నం చేస్తోందని, అక్కడి యువతను హింస వైపు ప్రేరేపించేలా చర్యలు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. మీరు (బీజేపీ) దీని నుంచి ఓ విజయాన్ని పొందారని అనుకోవచ్చు. వీధుల్లో మోగుతున్న డప్పు చప్పుళ్లతో మీరేదో అన్యాయాన్ని సరిచేశామని భావించవచ్చు. కానీ ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఈ సభ ఘోర తప్పిదానికి పాల్పడిందని భవిష్యత్‌ తరాలు తెలుసుకుంటాయి.

ఈ ఘోర తప్పిదాన్ని కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. మేం ఇక్కడ కూర్చుంటాం. మీరు (రాష్ట్రాలు) చెప్పేది వింటాం. కానీ రాష్ట్రాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాం అనేలా బీజేపీ వైఖరి ఉంది. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన రాజ్యసభలో ఉమ్మడి జాబితాలోని అంశాలపై బిల్లులు పాస్‌ చేస్తున్నారు. రాష్ట్రాల అధికారాలను బీజేపీ లాక్కుంటోంది. జమ్మూ కశ్మీర్‌లో మెజార్టీ యువత భారత్‌తోనే ఉంది. భారత్‌ నుంచి రక్షణ కోరుకుంటోంది. అదేసమయంలో కొంతమంది యువత హింసామార్గాన్ని ఎంచుకుంది. వాళ్లంతా భారత్‌ నుంచి స్వాత్రంత్యం కోరుకుంటున్నారు’అని ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top