తెలుగు నేర్చుకుంటున్నా..

Chennai public Welfare Honored to Tamilisai - Sakshi

తెలంగాణ అభివృద్ధికి కృషి

గవర్నర్‌ తమిళి సై వ్యాఖ్య

గౌరవం కన్నా...ఆప్యాయతే ముఖ్యం

ఘనంగా సత్కరించుకున్న చెన్నై పబ్లిక్‌ వెల్ఫేర్‌

సాక్షి, చెన్నై : తెలుగు నేర్చుకుంటున్నా..తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా అని ఆ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు. తనకు ఇక్కడ ఇస్తున్న గౌరవాన్ని చూస్తుంటే, ఒక రకమైన ఇబ్బంది కల్గుతోందని, అయితే, తనతో గతంలో వలే ఆప్యాయంగా మెలిగితే మరింత ఆనందంగా ఉంటుందన్నారు. రాష్ట్రానికి చెందిన తమిళి సై సౌందరరాజన్‌ తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. అక్కడ ఆమె బాధ్యతలు స్వీకరించి తన సేవలకు శ్రీకారం చుట్టి ఉన్నారు. తమిళనాడుకు చెందిన మహిళా నాయకురాలికి ఇంత పెద్ద పదవి దక్కడంతో ఆమెను సత్కరించుకునేందుకు చెన్నై పబ్లిక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. దీంతో టీనగర్‌లోని సర్‌ పిట్టి  త్యాగరాయ హాల్‌ వేదికగా ఆదివారం తమిళి సై సత్కార వేడుక జరిగింది. ఇందులో డీఎండీఎకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, పీఎంకే నేత జీకే మణి, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జ్ఞాన దేశికన్‌లతో పాటు పలు సంఘాలు, సంస్థల ప్రతినిధులుహాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసైను ఉద్దేశించి ప్రేమలత, శరత్‌కుమార్, జీకే మణి, జ్ఞానదేశికన్‌ ప్రసంగించే క్రమంలో ప్రత్యేక గౌరవాన్ని పాటించే రీతిలో (హర్‌ ఎక్సలెన్సీ) అన్నట్టుగా తమిళంలో ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చే రీతిలో తమిళిసై పేరుకు ముందుగా ఉపయోగించారు. అలాగే, ఆమె చేసిన సేవలు, ఆమెతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. కఠిన శ్రమకు గుర్తింపుగా గవర్నర్‌ పదవి ఆమెను వరించినట్టుగా కొనియాడారు. ఆమెలోని ధైర్యం, వాక్‌ చాతుర్యాన్ని గుర్తు చేశారు. అనంతరం తమిళి సై సౌందరరాజన్‌ ప్రసంగిస్తూ అందరికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఆప్యాయంగా.....
ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి అందరితో కలిసి మెలిగి తాను తిరిగినట్టు గతాన్ని తమిళిసై గుర్తు చేసుకున్నారు. తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లు సైతం ఇప్పుడు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తున్నారని, ఇది ప్రొటోకాల్‌ ధర్మంగా ఉన్నా, ఇది ఒకరకంగా ఇబ్బందికి గురి చేస్తున్నదని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడున్నా, తమిళి సై అని, ఇక్కడి వారి అభిమానం, ఆప్యాయతల మధ్య మెలిగానని, ఇది తన మీద చూపిస్తే మరింత ఆనందంగా ఉంటుందని స్పందించారు. దివంగత నేత మూపనార్‌ను చూసి తాను పెరిగినట్టు గుర్తు చేసుకున్నారు. తన వివాహానికి దివంగత నేతలు ఎంజీఆర్, కరుణానిధి హాజరై ఆశీస్సులు అందించారని, అవి ఇప్పుడు ఇంతటి స్థాయికి చేర్చాయని పేర్కొన్నారు. జయలలితలోని ధైర్యం, కరుణానిధిలో తమిళం, రాందాసులోని సామాజిక సేవ, విజయకాంత్‌లోని నిరాడంబరం మేళవింపుతో ముందుకు సాగాలన్న తపనతో ఉన్నట్టు పేర్కొన్నారు. దేవుడు ఇచ్చిన వరం, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఈ పదవితో, తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నానని, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తన బాధ్యతల మీద దృష్టి పెట్టి ఉన్నట్టు వివరించారు. శ్రమించే వారికి ఏదో ఒకరోజు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నది తన కు దక్కిన ఈ పదవి ఓ సాక్ష్యంగా పేర్కొన్నారు. తనకు వెన్నంటి భర్త సౌందరరాజన్‌ ఉన్నట్టుగా ఇక్కడున్న వాళ్లు అనేక మంది వ్యాఖ్యానించారని, ఆయన వెన్నంటి లేరని పక్క బలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలుగు నేర్చుకుంటున్నానని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో తన కృషిని అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కాళి దాసు, నిర్మాత∙కలైపులి థాను, తమిళ మానిల కాంగ్రెస్‌ జీఆర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top