ముగ్గురితో ‘గగన్‌యాన్‌’

Chandrayaan-2 to be launched in Jan 2019: ISRO chief - Sakshi

5–7 రోజుల అంతరిక్ష యాత్ర  

2022 ఆగస్టు 15కు 6 నెలల ముందే ప్రయోగం

వ్యయం రూ.10 వేల కోట్ల కన్నా తక్కువే: ఇస్రో చైర్మన్‌ శివన్‌

న్యూఢిల్లీ: భారత్‌ చేపట్టబోయే తొలి మానవసహిత అంతరిక్ష యాత్రలో ముగ్గురు వ్యోమగాములను నింగిలోకి పంపిస్తామని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ వెల్లడించారు. వారు 5–7 రోజుల పాటు అంతరిక్షయానం చేసిన తరువాత భూమి మీద తిరిగి అడుగుపెడతారని తెలిపారు. భారతీయుడిని అంతరిక్షంలోకి మోసుకెళ్లే ‘గగన్‌యాన్‌’ మిషన్‌ను 2022 నాటికి చేపడతామని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. గగన్‌యాన్‌ సన్నద్ధత, ప్రయోగానికి సంబంధించిన ఇతర వివరాలను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌తో కలసి ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ మంగళవారం మీడియాకు వివరించారు.

2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి సుమారు 6 నెలల ముందే ఈ మిషన్‌ చేపడతామని తెలిపారు. లాంచ్‌ప్యాడ్‌ నుంచి ప్రయోగించిన 16 నిమిషాల్లోనే రాకెట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేరుతుందని వెల్లడించారు. అంతరిక్ష యాత్ర ముగించుకుని భూమికి తిరుగుపయనమైన వ్యోమగాములు గుజరాత్‌ తీరంలోని అరేబియా సముద్రంలో లేదా బంగాళాఖాతంలో లేదా నేరుగా నేల మీదనైనా దిగుతారని చెప్పారు. వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్‌ భూ ఉపరితలానికి 120 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు 36 నిమిషాల్లోనే నేలకు చేరుకుంటుం దన్నారు. ఇది సఫలమైతే మానవ సహిత వాహకనౌకలను అంతరిక్షంలోకి పంపిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ నాలుగో దేశంగా నిలుస్తుంది.

మోసుకెళ్లేది జీఎస్‌ఎల్వీ మార్క్‌–3
గగన్‌యాన్‌కు జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 వాహకనౌకను సిద్ధం చేస్తున్నట్లు శివన్‌ తెలిపారు. భూమి నుంచి సుమారు 300–400 కి.మీ. ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఈ వాహకనౌకను చేరుస్తామని చెప్పారు. ఈ ప్రయోగానికి మొత్తం వ్యయం రూ.10 వేల కోట్ల కన్నా తక్కువే అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌లో సుమారు 7 టన్నుల బరువైన క్రూ మాడ్యూల్, సర్వీస్‌ మాడ్యూల్, ఆర్బిటాల్‌ మాడ్యూల్‌లు ఉంటాయని, అందులో క్రూ మాడ్యూల్‌ పరిమాణం 3.7్ఠ7 మీటర్లు అని చెప్పారు.

వ్యోమగాములు అంతరిక్షంలో ‘మైక్రో గ్రావిటీ’పై ప్రయో గాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వారిని ఇస్రో, వైమానిక దళం సంయుక్తంగా ఎంపికచేసి,  రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేశ్‌ శర్మ నుంచి ఇస్రో సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఆయన 1984లో రష్యా ప్రయోగించిన సోయుజ్‌ టి–11 వాహకనౌకలో అంతరిక్షంలోకి ప్రయాణించారు.

జనవరిలో చంద్రయాన్‌–2
చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని వచ్చే జనవరిలో చేపడతామని శివన్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టును సమీక్షించిన నిపుణులు.. రోవర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం, తిరిగి భూమి మీదికి తీసుకురావడంపై కొన్ని సూచనలు చేశారన్నారు. ఇస్రో చేసిన ప్రయోగాల్లో చంద్రయాన్‌–2 అత్యంత క్లిష్టమైందని, దీన్ని విజయవంతం చేయడానికే నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇలా చేసిన మార్పుల వల్ల మిషన్‌ బరువు పెరిగిందని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top