కేంద్రానికి సుప్రీం ఝలక్‌

Centre sends back names of two judges recommended for SC elevation - Sakshi

జస్టిస్‌ బోస్, జస్టిస్‌ బోపన్నలను మళ్లీ ప్రతిపాదించిన కొలీజియం

వీరి సమర్థత, ప్రవర్తన విషయంలో అభ్యంతరాలేవీ లేవని వెల్లడి

న్యూఢిల్లీ: జడ్జీల పదోన్నతుల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల పేర్లను సుప్రీంకోర్టు జడ్జీలుగా మరోసారి సిఫార్సు చేసింది. ఈ విషయంలో కేంద్రం వ్యక్తంచేసిన అభ్యంతరాలను కొలీజియం తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం.. ‘అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఏప్రిల్‌ 12న మేం సిఫార్సు చేసిన జడ్జీలు జస్టిస్‌ బోస్, జస్టిస్‌ బోపన్నలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించాం.

ఈ ఇద్దరు జడ్జీల సమర్థత, ప్రవర్తన, సమగ్రత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర జడ్జీల సీనియారిటీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సహా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని స్పష్టం చేసింది. వీరిద్దరితో పాటు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, హిమాచల్‌ప్రదేశ్‌ సీజే జస్టిస్‌ సూర్యకాంత్‌లకు కూడా సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రెండు తీర్మానాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో కొలీజియం అప్‌లోడ్‌ చేసింది. 

అంతకుముందు జస్టిస్‌ బోస్, జస్టిస్‌ బోపన్నలకు పదోన్నతులు కల్పించాలని ఏప్రిల్‌ 12న కొలీజియం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. జార్ఖండ్‌ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ బోస్‌ దేశవ్యాప్తంగా సీనియారిటీలో 12వ స్థానంలో, గువాహటి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ బోపన్న సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారని కేంద్రం తెలిపింది. సీనియారిటీతో పాటు ఇతర ప్రాంతాలకు అత్యున్నత న్యాయస్థానంలో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

కాగా కేంద్రం అభ్యంతరాలను తిరస్కరించిన సుప్రీం కొలీజియం, జస్టిస్‌ బోస్, జస్టిస్‌ బోపన్నతో పాటు మరో ఇద్దరు జడ్జీల పేర్లను సిఫార్సు చేసింది. కొలీజియంలో సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌తో పాటు జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ రమణ, జస్టిస్‌మిశ్రా, జస్టిస్‌ నారిమన్‌లు ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన పేర్ల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రం తిప్పిపంపవచ్చు. కానీ ఆ న్యాయమూర్తుల పేర్లను కొలీజియం మరోసారి సిఫార్సుచేస్తే మాత్రం కేంద్రం వాటిని తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధనలేవీ లేవు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top