కేంద్ర ఉద్యోగులకు 1% డీఏ పెంపు

కేంద్ర ఉద్యోగులకు 1% డీఏ పెంపు - Sakshi


► పింఛనుదారులకు కూడా..

► పన్నురహిత గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంపు

► కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

► కీలక కమిటీల్లోకి కొత్త కేబినెట్‌ మంత్రులు  




న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు మేలు చేసేలా కరువు భత్యం (డీఏ), డియర్‌నెస్‌ రిలీఫ్‌ (డీఆర్‌)లను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ప్రస్తుతమున్న 4 శాతం (మూల వేతనం/పింఛనుపై) డీఏను మరో శాతం పెంచేందుకు అంగీకారం తెలిపారు. దీని ద్వారా 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛనుదారులకు లాభం చేకూరనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ ఒక శాతం డీఏ, డీఆర్‌ పెంపు వర్తిస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పెంపు ద్వారా ఖజానాపై ఏడాదికి రూ. 3,068.26 కోట్ల భారం పడనుండగా.. 2017–18 సంవత్సరానికే (జూలై 2017–ఫిబ్రవరి 2018) రూ. 2,045.50 కోట్లు భారం పడుతుంది.


దీంతోపాటుగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలోని స్వతంత్ర సంస్థల (సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలు వర్తించని) ఉద్యోగులకు చెందాల్సిన పన్ను రహిత గ్రాట్యుటీని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతూ సవరించిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ గ్రాట్యుటీ (సవరణ) బిల్లు–2017ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. 7వ వేతన కమిషన్‌ ప్రతిపాదనల అమలుకు ముందు ఇది రూ. 10 లక్షలుగా ఉండేది. ఈ పెంపు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి రానుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించేందుకే పన్నురహిత గ్రాట్యుటీ పరిధిని పెంచారు.



ఒప్పందాల వివరాలు తెలపరా?

విదేశాలతో చేసుకునే ఒప్పందాలను తమకు వెల్లడించటంలేదంటూ కేబినెట్‌ సెక్రటేరియట్‌ వివిధ ప్రభుత్వ శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు మినహా సంస్కృతి, సైన్స్‌ మొదలైన అన్ని ఒప్పందాలను  సంబంధిత మంత్రి ఆమోదం తర్వాత కేబినెట్‌ సెక్రటేరియట్‌కు తెలియజేయాలని కోరింది. తద్వారా విదేశాంగ శాఖకు, కేబినెట్‌కు  సమాచారం అందించేందుకు వీలుంటుందని పేర్కొంది. ఒప్పందం జరిగిన నెలలోపు ఈ సమాచారం కేబినెట్‌ సెక్రటేరియట్‌కు తెలియాల్సిందేనని స్పష్టం చేసింది.



మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలు:

► పదోన్నతి పొందిన మంత్రులు నిర్మలా సీతారామన్‌ (భద్రత, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలు), పీయూష్‌ గోయల్‌ (రాజకీయ, ఆర్థిక వ్యవహారాలు), ధర్మేంద్ర ప్రధాన్‌ (ఆర్థిక వ్యవహారాలు)లను కీలకమైన కేబినెట్‌ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. మంత్రి ఉమాభారతికి ఇప్పుడు ఏ కమిటీలోనూ సభ్యత్వం లేదు.

►  రూ.2,081.27 కోట్లతో దౌండ్‌–మన్మాడ్‌ రైల్వే డబ్లింగ్‌ (247.5 కి.మీ.) పనులకూ కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.  

► మొరాకో, అర్మేనియా దేశాలతో జరిగిన ఒప్పందాలకూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top