పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

Brutal Reality of Cast System - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘కులాంతర వివాహాన్ని, అందులోను దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు నన్ను, నా భర్త అజితేష్‌ కుమార్‌ను నా తండ్రి చంపాలనుకుంటున్నారు. నా తండ్రి నుంచి మమ్మల్ని కాపాడండి!’ అంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజేష్‌ మిశ్రా కూతరు సాక్షి మిశ్రా ఓ వీడియో ద్వారా అప్పీల్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెల్సిందే. ఇలా ఆమె పిలుపునివ్వడం కొత్త కావచ్చేమోగానీ, కులాంతర వివాహాల కారణంగా ‘పరువు’ పేరిట హత్యలు కొనసాగడం మన భారత దేశంలో ఏమాత్రం కొత్త కాదు. 

చదవండి: ‘వాళ్లు మమ్మల్ని కచ్చితంగా చంపేస్తారు’

గుజరాత్‌లో అగ్రవర్ణానికి చెందిన అమ్మాయిని చేసుకున్నందుకు ఓ దళితుడిపై సోమవారం అత్తింటివారు దాడి చేసి హత్య చేశారు. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ గర్భవతి, ఆమె భర్తను గురువారం నరికి చంపేశారు. ఒకే కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకోకపోవడం ఈ ఆధునిక సమాజంలో కూడా నేరంగా పరిగణిస్తున్నారు. ఈ కారణంగా తమ కడుపు చించుకు పుట్టిన బిడ్డల్నే తల్లిదండ్రులు అన్యాయంగా కడతేరుస్తున్నారు. భారత ఉప ఖండంలో 2000 నుంచి 3000 సంవత్సరాల మధ్య కాలంలోనే కుల వ్యవస్థ వేళ్లూనుకుంది. 

ఒక్క భారత దేశంలోనే జన్యుపరంగానే నాలుగు వేల కులాలు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్న నేటి ఆధునిక రోజుల్లో కూడా కుల వ్యవస్థను దెబ్బతీయలేక పోతున్నామని ఢిల్లీలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన త్రిదీప్‌ రే, ఆర్కా రాయ్‌ చౌధురి, కోమల్‌ సహాయి కులాంతర వివాహాలపై నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో  కులాంతర వివాహాలు జరగడం కొంత ఆశ్చర్యంగా ఉంది. పారిశ్రామీకరణ పెరిగినప్పటికీ కుల వ్యవస్థలోగానీ, అంతర్‌ కుల వివాహాల్లోను పెద్దగా మార్పులు రావడం లేదని కుముదిని దాస్, కైలాస్‌ చంద్ర దాస్, తరుణ్‌ కుమార్‌ రాయ్, ప్రదీప్‌ కుమార్‌ త్రిపాఠిలు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. 

చదవండి: ఏజ్‌ గ్యాప్‌, ఇన్‌కం కారణంగానే..

పారిశ్రామికంగా తమిళనాడు ఎంతో పారిశ్రామికంగా అభివద్ధి చెందినప్పటికీ అంతర్‌ కుల వివాహాలు 87 శాతం. ఇది దేశంలోనే ఎక్కువ. ఇప్పటికీ దేశంలో కులంతర వివాహాలు కేవలం 5.8 శాతమే. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2001 నుంచి 2011 మధ్య ప్రతి 20 వివాహాల్లో 19 వివాహాలు ఒకే కులాల మధ్య జరిగాయి. జీవన ప్రమాణాల విషయంలోను కులాల మధ్య ఎంతో తేడా ఉంది. అగ్రకుల బాలుడికన్నా దళిత బాలుడు ఏడాదిలో మరణించే అవకాశం 42 శాతం ఎక్కువ కాగా, అగ్రకుల మహిళ సగటు జీవన ప్రమాణం 59.5 సంవత్సరాలుకాగా, దళిత మహిళా జీవించే ఆయు ప్రమాణం 39.5 సంవత్సరాలు మాత్రమే.

భారత దేశం సాంకేతికంగా ఎంతో అభివద్ది చెందిందనడానికి తమకు వాటిల్లనున్న ముప్పు గురించి సాక్షి మిశ్రా దంపతులు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వీడియోను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమే నిదర్శనం. అయినప్పటికీ కుల వ్యవస్థతో ఉన్న ముప్పు ఇప్పట్లో పోయేలా లేదు. అప్పటి వరకు కులాంతర వివాహాలు చేసుకున్న శాక్షి మిశ్రా లాంటి వాళ్లు తల్లిదండ్రులకు దొరకనంత దూరంగా పారిపోవాల్సిందే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top