బీజేపీపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం | BJP has not declared its CM candidate and how it wins, says Mayawati | Sakshi
Sakshi News home page

బీజేపీపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం

Feb 26 2017 7:15 PM | Updated on Aug 15 2018 2:32 PM

బీజేపీపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం - Sakshi

బీజేపీపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం

బీజేపీపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు.

లక్నో: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బాలియాలో నిర్వహించిన ర్యాలీలో మాయావతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పటివరకూ ప్రకటించని బీజేపీ యూపీలో ఎలా గెలుస్తుందని ఆశిస్తున్నారని ప్రశ్నించారు. యూపీలో బీజేపీ నెగ్గే ప్రసక్తే లేదని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు అని అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికలపై నమ్మకం లేనందున అభ్యర్థి పేరును ప్రకటించడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని మాయావతి ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేస్తుందని, అందుకే బీజేపీకి ఓటేయవద్దని ఓటర్లకు సూచించారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఆరెస్సెస్ అజెండాను ఇక్కడ ప్రవేశపెడతారని, దాంతో రిజర్వరేషన్లకు మంగళం పాడతారని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ వివక్షాపూరితమైన రాజకీయాలు చేస్తారని విమర్శించారు. సీఎం అఖిలేశ్ యాదవ్ తమ పార్టీ పాలసీలనే ఫాలో అవుతున్నారని ఆరోపించారు. గతంలో తమ బీఎస్పీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను అఖిలేశ్ కొనసాగిస్తున్నారని, అయితే పథకాల పేర్లలో కాస్త మార్పు చేశారని ఆమె ఎద్దేవా చేశారు.

రేపు (సోమవారం) యూపీలో ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. 11 జిల్లాల్లోని 51 నియోజక వర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాపూర్ నియోజకవర్గం పోలింగ్ ను వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మృతిచెందడంతో ఈ స్థానానికి పోలింగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement