
సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శుక్రవారం 13 మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో ప్రముఖ పటేల్ నేతలకు, పలు కొత్త ముఖాలకు చోటు కల్పించింది. ప్రముఖ పటేల్ నేతలు పంకజ్‌భాయ్ దేశాయ్‌ను నడియాద్ నుంచి, వల్లభ్‌భాయ్ కకాడియాను తక్కర్‌బపనగర్ నుంచి మరోసారి బరిలో దింపింది.
ఇక ధనేరా, వద్గాంల నుంచి పటేల్ వర్గానికి చెందిన మావ్జీబాయ్ దేశాయ్, విజయ్‌భాయ చక్రవర్తిలను తొలిసారిగా నామినేట్ చేసింది. ఇదార్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ స్పీకర్ రామ్‌లాల్ ఓహ్రా స్థానంలో ప్రముఖ గుజరాతీ నటుడు హితేష్‌భాయ్ కనోడియాను బరిలో దింపింది. ఇక పంచ్‌మహల్ జిల్లాలోని కలోల్ నుంచి రెండుసార్లు ఎంఎల్‌ఏగా ప్రాతినిథ్యం వహించిన అరవింద్ సింహ్ రాథోడ్ స్ధానంలో గోద్రా ఎంపీ ప్రభాత్ సింహ్ చౌహాన్ కోడలు సుమన్‌బెన్ చౌహాన్‌ను రంగంలోకి దింపింది.
తాజా జాబితాతో గుజరాత్ అసెంబ్లీలోని 182 సీట్లకు గాను 147 స్ధానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.రాష్ట్రంలో డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు చేపడతారు.