బిహార్‌ యువకుడి వివాహం చెల్లదన్న కోర్టు

Bihar Court Declares Vinod Kumar Pakadwa Vivah Void - Sakshi

పట్నా : రెండేళ్ల క్రితం బిహార్‌లో జరిగిన ఓ వివాహం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాధరణంగా అమ్మాయిని కిడ్నాప్‌ చేసి, బెదిరించి వివాహం చేసుకునే సంఘటనల గురించి చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం అబ్బాయిని గన్నుతో బెదిరించి.. పెళ్లి మంటపానికి లాక్కొచ్చి మరి బలవంతంగా వివాహం‍ జరిపించారు. 2017లో జరిగిన ఈ ‘పకడ్వా వివాహం’(బలవంతపు పెళ్లి) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలు.. వినోద్‌ కుమార్‌ అనే వ్యక్తి బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వినోద్‌కు.. సురేంద్ర అనే వ్యక్తి తారసపడ్డాడు. లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి బైక్‌ మీద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువచ్చాడు సురేంద్ర.

అప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. సురేంద్ర చెల్లి పెళ్లి కూతురు స్థానంలో కూర్చుని ఉంది. సురేంద్ర బంధువులంతా మండపం దగ్గర ఉన్నారు. ఇంతలో సురేంద్ర గన్ను తీసి వినోద్‌ తలకు గురిపెట్టి.. అతడిని పెళ్లిమంటపానికి లాక్కెళ్లాడు. తన చెల్లిని వివాహం చేసుకోకపోతే.. చంపేస్తానని బెదిరించాడు. గతిలేని పరిస్థితుల్లో వినోద్‌.. ఆ పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. అనంతరం వినోద్‌.. తనకు బలవంతంగా పెళ్లి చేశారని.. ఈ వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాడు. అంతేకాక సురేంద్ర కుటుంబం మీద క్రిమినల్‌ కేసు కూడా పెట్టాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు ప్రయత్నించారు.

కానీ అప్పటికే సోషల్‌ మీడియాలో వినోద్‌ పెళ్లి వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అనంతరం వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఈ ఏడాది మేలో కోర్టు వినోద్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బలవంతపు వివాహం చెల్లదని పేర్కొంది. వినోద్‌ పెళ్లి ఆధారంగా ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top