ఉగ్రవాదుల కర్మాగారం.. బాలాకోట్‌

Balakot who bombed and destroyed bombs - Sakshi

జనావాసాలకు దూరంగా కొండపైన ఓ సువిశాల ప్రాంతం... ఒకవైపు మదర్సాలు, మసీదులు... మరోవైపు ఏటా 10 వేల మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా తయారు చేసుకున్న కంట్రోల్‌ రూమ్‌లు. మంగళవారం భారత వైమానిక దళం బాంబులు కురిపించి నాశనం చేసిన బాలాకోట్‌ స్వరూపమిది. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు ఉన్న అతిపెద్ద శిక్షణ ప్రాంగణం బాలాకోట్‌. జైషే కీలక నేతలు ఇక్కడే ఉగ్రవాదులకు జీహాదీ శిక్షణ ఇస్తుంటారు. ఇక్కడి కంట్రోల్‌ రూమ్‌లలో భారత్‌పై ఉగ్రదాడులకు వ్యూహాలు పన్నుతూ, వాటిని అమలును పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం యూసఫ్‌ అజహర్‌ ఈ శిక్షణ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. పదకొండేళ్లు దాటిన 10 వేల మంది పిల్లలకు ఏటా ఇక్కడ ఉగ్ర శిక్షణ ఇస్తుంటారు.

బాలాకోట్‌లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తుంటారు. శిక్షణ ఇచ్చేందుకు విశాలమైన మైదానాలు, సిములేటర్లు కూడా ఉన్నాయి. 2000–2001 సంవత్సరాల మధ్య ఏర్పాటైన జైషే ఉగ్రవాద సంస్థ బాలాకోట్‌లో అతిపెద్ద సైనిక శిక్షణ శిబిరంగా రూపొందింది. దీని వ్యవహారాలన్నీ జైషే అధినేత మసూద్‌ అజహర్, అతని సోదరుడు అబ్దుల్‌ రాఫ్‌ అస్గర్‌లు చూస్తుంటారని చెబుతారు. భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. చాలా ఇంటరాగేషన్‌ నివేదికల్లో, పఠాన్‌కోట్‌ కేసు చార్జిషీటులో కూడా బాలాకోట్‌ను పేర్కొన్నామని ఆ వర్గాలు తెలిపాయి. అమెరికా కూడా దీనిపై కన్నేసి ఉంచింది. 2001లో జరిగిన జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ పేల్చివేతకు బాలాకోట్‌లోనే వ్యూహరచన జరిగిందని నిఘా వర్గాల సమాచారం.

వ్యూహాత్మక కేంద్రం...
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు కొద్ది దూరంలో పాక్‌ భూభాగంలోని ఖైబర్‌–పక్తున్‌ఖ్వా రాష్ట్రంలో ఉంది బాలాకోట్‌. ఇక్కడి నుంచి ఇస్లామాబాద్‌ 195 కిలోమీటర్లు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని ముజఫరాబాద్‌ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 కిలోమీటర్ల దూరంలో వాస్తవాధీన రేఖ ఉంది. ‘ఇటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు అటు పాకిస్తాన్‌కు దగ్గరగా ఉండటంతో ఇది జైషేకు వ్యూహాత్మకంగా కీలక స్థావరమైంది. బాలాకోట్‌లో శిక్షణ శిబిరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సౌదీ అరేబియా, ఆల్‌ రహమత్‌ ట్రస్ట్‌ సహా పలు ముస్లిం సంస్థలు మసూద్‌కు భారీగా విరాళాలు ఇచ్చాయి. దాంతో కొన్నేళ్లలోనే ఇది వారికి కీలక స్థావరంగా తయారైంది’ అని నిఘా వర్గాలు వివరించాయి. ఇక్కడి విద్యార్ధులకు మదర్సాలలో ఉగ్రవాద విద్య నేర్పుతారు. బాలాకోట్‌లోనే కాకుండా పెషావర్, ముజఫరా బాద్, చకోటీలలోనూ జైషేకు స్థావరాలున్నాయి. కానీ అన్నిటికంటే బాలాకోటే కీలకమైనది.

అఫ్గాన్‌ నుంచి మారిన చిరునామా...
2001కి ముందు జైషే శిక్షణ శిబిరాలు అఫ్గానిస్తాన్‌లో ఉండేవి. అయితే 2001 తర్వాత అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా విరుచుకు పడటంతో జైషే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు దగ్గరగా ఉన్న మన్‌షెరా జిల్లాను తొలుత తమ స్థావరంగా మార్చుకుంది. ఆ తర్వాత అది స్థావరాన్ని బాలాకోట్‌కు మార్చింది. బాలాకోట్‌ స్థావరాల గురించి 15 ఏళ్ల క్రితమే అమెరికా రికార్డుల్లో నమోదైంది. వికీలీక్స్‌ పత్రాల్లో ఈ సమాచారం ఉంది. అమెరికాలోని గ్వాంటానామో జైలులో ఖైదీ అయిన హఫీజ్‌ కె.రహ్మాన్‌ విచారణ సందర్భంగా వెల్లడించిన విషయాలు అందులో ఉన్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top