నాజీల స్ఫూర్తితోనే ఎమర్జెన్సీ | Arun Jaitley Equates Indira Gandhi With Hitler On Emergency | Sakshi
Sakshi News home page

నాజీల స్ఫూర్తితోనే ఎమర్జెన్సీ

Jun 25 2018 6:16 PM | Updated on Aug 20 2018 5:17 PM

Arun Jaitley Equates Indira Gandhi With Hitler On Emergency - Sakshi

కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ (ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జర్మన్‌ నియంత హిట్లర్‌కు మధ్య పోలికలున్నాయని, వారిద్దరూ ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారని కేంద్ర మంత్రి జైట్లీ విమర్శించారు. 1975 జూన్‌ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం తెల్సిందే. 3 భాగాల సిరీస్‌ ‘ద ఎమర్జెన్సీ రీవిజిటెడ్‌’లో రెండోదైన ‘ద టైరనీ ఆఫ్‌ ఎమర్జెన్సీ’పేరిట ఫేస్‌బుక్‌లో ఓ ఆర్టికల్‌ను జైట్లీ పోస్ట్‌ చేశారు. హిట్లర్‌ కంటే ఒకడుగు ముందుకేసిన ఇందిర.. భారత్‌ను రాజరికపు ప్రజాస్వామ్య దేశంగా మార్చారని, 1933లో నాజీ జర్మనీలో జరిగిన దానిని స్ఫూర్తిగా తీసుకునే ఇందిర ఎమర్జెన్సీకి పథకం రచించారని ఆరోపించారు.

‘హిట్లర్, ఇందిర ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారు. ఇందిరాగాంధీ అమలు చేసినంతగా కొన్ని హిట్లర్‌ కూడా చేయలేదు. మీడియాపై ఉక్కుపాదం మోపారు. పార్లమెంట్‌ కార్యకలాపాలను పత్రికల్లో రాకుండా ఇందిర అడ్డుకున్నారు. ప్రెస్‌ సెన్సార్‌షిప్‌కు సంబంధించి భారత్, జర్మనీలో అమలు చేసిన చట్టాలు ఒక్కటే’ అని చెప్పారు. హిట్లర్‌ రాజ్యాంగానికి లోబడి చర్యలు తీసుకుంటే.. ఇందిర ఆర్టికల్‌ 352 కింద ఎమర్జెన్సీని తీసుకొచ్చారని, ఆర్టికల్‌ 359 కింద ప్రాథమిక హక్కులను రద్దు చేశారని, దేశంలోని ప్రతిపక్షాలకు వ్యతిరేకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని చెప్పారు.

హిట్లర్‌ మాదిరిగానే ఇందిర పార్లమెంటులోని విపక్ష నేతలందరినీ అరెస్టు చేసి తన ప్రభుత్వానికి మూడింట రెండువంతుల ఆధిక్యాన్ని సాధించారని జైట్లీ గుర్తు చేశారు. జర్మనీకి ఒకే అత్యున్నత అధికార కేంద్రం ఉండాలని, ఆ అధికారం ఫ్యూరర్‌(హిట్లర్‌)కే ఉండాలని భావించేవారని.. అదే మాదిరిగా ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర అనుకునేలా చేశారని నాటి ఏఐసీసీ అధ్యక్షుడు దేవకాంత బారువా వ్యాఖ్యలను ఉటంకిస్తూ జైట్లీ చెప్పారు. కాగా, జైట్లీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను ప్రధానిమోదీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి జైట్లీ పోస్ట్‌లో రాశారని, వ్యక్తిగత స్వేచ్ఛను ఎమర్జెన్సీ ఎలా హరించింది.. రాజ్యాంగంపై నేరుగా ఎలా దాడి చేసింది వివరించారని ట్వీట్‌చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement