వార్‌ హీరో అర్జన్‌ అస్తమయం

వార్‌ హీరో అర్జన్‌ అస్తమయం - Sakshi


ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

1965 భారత్‌–పాక్‌ యుద్ధంలో ఎయిర్‌ మార్షల్‌గా కీలక పాత్ర




న్యూఢిల్లీ: 1965 భారత్‌–పాక్‌ యుద్ధ వీరుడు, భారత వాయుసేన (ఐఏఎఫ్‌) మార్షల్‌ అర్జన్‌ సింగ్‌(98) ఢిల్లీలో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన్ను ఇక్కడి ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆస్పత్రికి తరలించారు. చిక్సిత పొందుతూ రాత్రి 7.30 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఆర్మీలో ఫీల్డ్‌ మార్షల్‌ స్థాయి అయిన ఫైవ్‌ స్టార్‌ ర్యాంకుకు ప్రమోటైన ఏకైక అధికారి అర్జన్‌ సింగ్‌ కావటం విశేషం.



రిటైర్మెంట్‌ తర్వాత దౌత్యవేత్తగా భారత్‌కు సేవలందించారు. అర్జన్‌ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని  మోదీ, రక్షణ మంత్రి సీతారామన్, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా  సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌ గొప్ప యోధుణ్ని కోల్పోయిందని రాష్ట్రపతి సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘దేశానికి అర్జన్‌ సింగ్‌ చేసిన సేవలు మరువలేనివని.. వీరుని మృతితో యావద్భారతం విచారంలో మునిగిపోయింది’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఉదయం అర్జన్‌  అనారోగ్య విషయం తెలవటంతో మోదీ,  సీతారామన్, ఐఏఎఫ్‌ చీఫ్‌ దనోవా, ఆర్మీ చీఫ్‌  రావత్‌లు ఆస్పత్రిలో సింగ్‌ను పరామర్శించారు.



భారత్‌ మరువని యోధుడు

1965 ఏప్రిల్‌లో భారత్‌–పాక్‌ యుద్ధం మొదలైంది. అప్పటికే పాకిస్తాన్‌పై భారత్‌ పైచేసి సాధిస్తోంది. కీలకమైన శిఖరాలను భారత్‌ ఆధీనంలోకి తీసుకుంది.  భారత్‌ను నిలువరించే ఉద్దేశంతో 1965 సెప్టెంబర్‌ 1, పాకిస్తాన్‌ ‘ఆపరేషన్‌ గ్రాండ్‌శ్లామ్‌’ను ప్రారంభించింది. భారత్‌ తేరుకునేలోపే కశ్మీర్‌లోని అఖ్‌నూర్‌తోపాటు పలు భారత ఆర్మీ కేంద్రాలను పాక్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో సైన్యం వైమానిక సాయాన్ని అర్థించింది.



పరిస్థితి ఊహించిన అర్జన్‌ సింగ్‌ యువ ఐఏఎఫ్‌ అధికారుల్లో యుద్ధ స్ఫూర్తి నింపారు. ఐఏఎఫ్‌ చీఫ్‌గా ఉన్నప్పటికీ.. తనే స్వయంగా యుద్ధ విమానంతో కదనరంగంలోకి దూకారు. ఊహించని రీతిలో మెరుపుదాడులతో పాకిస్తాన్‌ సైన్యం తోకముడిచేలా చేయటంలో కీలకపాత్ర పోషించారు. సరిహద్దులనుంచి పాక్‌ సైన్యాన్ని వెనక్కు పంపటంతోపాటుగా.. పాకిస్తాన్‌లోని పంజాబ్‌పై భీకరమైన వైమానిక దాడులు చేశారు. దీంతో పాక్‌ బలగాలన్నీ పంజాబ్‌ను కాపాడుకునేందుకు వెనక్కు వెళ్లిపోయాయి.



దీంతో ఆపరేషన్‌ గ్రాండ్‌శ్లామ్‌ విఫలమైంది. ఈ విజయంలో అర్జన్‌ సింగ్‌ పాత్ర అత్యంత కీలకం. ఇందుకుగానూ 1965లో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మ విభూషణ్‌తో గౌరవించింది. 1964 నుంచి 1969 వరకు ఐఏఎఫ్‌ చీఫ్‌గా కొనసాగారు. ఐఏఎఫ్‌ను ప్రపంచ వైమానిక బలగాల్లో ఒక సమర్థవంతమైన వ్యవస్థగా, నాలుగో అతిపెద్ద వైమానిక శక్తిగా మలచిన ఘనత కూడా అర్జన్‌ సింగ్‌దే కావటం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుంచి రిటైర్మెంట్‌ వరకు 60కి పైగా వివిధ యుద్ధ, సైనిక రవాణా విమానాలు నడిపిన అనుభవం అర్జన్‌ సింగ్‌ సొంతం.



కుటుంబమంతా సైన్యంలోనే..

అవిభాజ్య భారత్‌లోని పంజాబ్‌ (ఇప్పటి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌)లో 1919, ఏప్రిల్‌ 15న అర్జన్‌ సింగ్‌ జన్మించారు. ఈయన తండ్రి, తాత, ముత్తాతలు బ్రిటీష్‌ అశ్వికదళంలో సేవలందించారు. బ్రిటన్‌లోని క్రాన్‌వెల్‌లో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకున్న అర్జన్‌.. అదే ఏడాది పైలట్‌ ఆఫీసర్‌గా విధుల్లోకి చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాను ఆక్రమించుకు న్న జపాన్‌ సేనలపై సింగ్‌ నేతృత్వంలోని భారత వాయుసేన భీకర దాడులు చేసింది. దీంతో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు ‘డిస్టింగ్విష్డ్‌ ఫ్లయింగ్‌ క్రాస్‌’ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ పైలట్‌ కూడా ఆయనే. 1969లో సింగ్‌ పదవీ విరమణ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top