అమిత్‌ షా.. దాల్‌ మే కుచ్‌ కాలా హై!

Amit Shah Deposits Scam Issue After Demonetisation Is trending - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పెద్ద కుంభకోణం అంటూ కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణిస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌ జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకులో అనూహ్య డిపాజిట్ల స్కామ్‌ వెలుగుచూసింది. ఇందులో నిజంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్‌ షాకు పాత్ర ఉందా? ఉంటే అది ఏ మేరకు? ఈ కుంభకోణంలో లాభపడింది అమిత్‌ షా ఒక్కరేనా? ఇతరులేమైనా ఉన్నారా? బీజేపీ పార్టీ పాత్ర కూడా ఏమైనా ఉందా? పెద్ద నోట్లను రద్దు చేసిన ఏడాదిలోనే బీజేపీ నిధులు ఏకంగా 81 శాతం పెరగడానికి ఈ స్కామ్‌కు ఏమైనా లింకు ఉందా? అసలు ఇది స్కామా? కాదా?

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 2016, నవంబర్‌ 8న ప్రకటించిన అయిదు రోజుల్లోనే అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న అహ్మదాబాద్‌ జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకులోకి 746 కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చి చేరాయి. ఓ జిల్లా సహకార బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు నమోదవడం ఇదే మొదటిసారి. మరో రకంగా చెప్పాలంటే పెద్ద నోట్లరద్దు అనంతరం డిపాజిట్ల నమోదులో మొదటి స్థానంలో నిలిచింది అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు. ఆ తర్వాత రెండో స్థానాన్ని 693 కోట్ల రూపాయల డిపాజిట్లతో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లా కోపరేటివ్‌ బ్యాంక్‌ ఆక్రమించింది. ఈ బ్యాంక్‌కు చైర్మన్‌గా రాష్ట్ర బీజేపీ కేబినెట్‌ మంత్రి జయేష్‌ భాయ్‌ విఠల్‌ భాయ్‌ రాడాడియా వ్యవరిస్తున్నారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 జిల్లా సహకార బ్యాంకులు డిపాజిట్లలో ముందున్నాయి. ఎందుకిలా జరిగింది?  పెద్ద నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పించినందున ఇంత మొత్తాల్లో డిపాజిట్లు వచ్చాయని ఎవరైనా సమర్థించవచ్చు. దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటే గుజరాత్‌ రాష్ట్ర కో-ఆపరేటివ్‌ బ్యాంకులో 1.11 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్లు నమోదయ్యాయి. అంత ఎక్కువ డిపాజిట్లకు, ఇంత తక్కువ డిపాజిట్లకు కారణాలేమిటో ఏ విజ్ఞులైన వివరించగలరా? 

సహకార చట్టం కింద సామాజిక కార్యకర్త మనోరంజన్‌ ఎస్‌. రాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు ఈ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థ గురువారం తొలిసారిగా ఈ వార్తను వెలుగులోకి తీసుకురాగా, ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు యథాతథంగా, మరికొన్ని మీడియా సంస్థలు మార్పులు, చేర్పులతో ప్రజల దష్టికి తీసుకొచ్చాయి. ఇందులో పెద్ద కుంభకోణం ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శలు అందుకోవడంతో జిల్లా సహకార బ్యాంకుల కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే నాబార్డ్‌ (నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) ఓ వివరణ ఇచ్చింది. రాష్ట్రంలోనే అహ్మదాబాద్‌ జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఉత్తమమైనదిగా గుర్తింపు పొందిందని, అందుకే ఆ బ్యాంకుకు అన్ని డిపాజిట్లు వచ్చాయని పేర్కొంది. ఓ జిల్లా సహకార బ్యాంకులో 746 కోట్లు వస్తే ఎంత చెత్తదైనా రాష్ట్ర సహకార బ్యాంకుకు 1.1 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయా? అంతటి చెత్తయితే ఆ బ్యాంకును రద్దు చేయడం ఉత్తమం కదా! అహ్మదాబాద్‌ సహకార బ్యాంకులో 98.66 శాతం మంది రెండున్నర లక్షల రూపాయలకు లోపే డిపాజిట్లు చేశారని, వారిలో కూడా ఎక్కువ మంది రైతులే ఉన్నారని కూడా నాబార్డ్‌ సమర్థించేందుకు ప్రయత్నించింది. 

ఈ లెక్కన మిగిలిన దాదాపు 1.44 శాతం మంది మాత్రమే రెండున్నర లక్షలకుపైగా డిపాజిట్లు చేశారన్నమాట. వీరిలో ఎవరు, ఎంత డిపాజిట్‌ చేశారో నాబార్డ్‌ వివరాలు ఇవ్వలేదు. 98.99 శాతం మంది రెండున్నర లక్షల రూపాయల లోపు డిపాజిట్‌ చేశారంటే, ఒక్కొక్కరు 2,49,999 రూపాయల చొప్పున డిపాజిట్‌ చేశారనుకుంటే 395 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే మిగిలిన 1.44 శాతం మంది 351 కోట్ల రూపాయలను డిపాజిట్‌ చేసినట్లు అవుతుంది. అంతటి కుభేరులు ఎవరు? వారికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద నోట్ల రద్దుకు ముందు అంటే 2015–2016 ఆర్థిక సంవత్పరానికి బీజేపీ నిధులు 570.86 కోట్ల రూపాయలు ఉండగా, పెద్ద నోట్ల రద్దు అనంతరం అంటే, 2016–2017 సంవత్సరానికి 1,034.27 కోట్ల రూపాయలు పెరిగింది. ఒక్కసారే 81.18 శాతం పార్టీ నిధుల పెరుగుదలకు ఆర్థిక సూత్రం ఏమిటో ఎవరైనా వివరించగలరా?

జిల్లా సహకార బ్యాంకుల్లో ఆరవ రోజు నుంచి పెద్ద నోట్ల మార్పిడిని అనుమతించమంటూ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు పెద్ద నోట్లను రద్దు చేసిన ఐదవ రోజున కొత్త ప్రకటన చేసింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో వివరించలేదు. బ్యాంకులు అమలు చేస్తున్న ‘నో యువర్‌ కస్టమర్‌’ నిబంధనలను జిల్లా సహకార బ్యాంకులు పాటించడం లేదు కనుక వాటిల్లో నల్లడబ్బు వచ్చి చేరే అవకాశం ఉంది. దీన్ని ముందుగా గ్రహించలేకపోయిన ఆర్బీఐ గుజరాత్‌ డిపాజిట్లను చూసి కళ్లు తెరిచిందా? బీజేపీ నేతలు, వారి అస్మదీయుల డిపాజిట్లు రాగానే, ఇతర పార్టీల నేతలకు ఆ అవకాశం కల్పించరాదన్న దురాలోచనతో కొత్త నిబంధనను తీసుకొచ్చిందా? కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణిస్తున్నట్లు పెద్ద నోట్ల రద్దు దేశంలోనే ‘అతిపెద్ద కుంభకోణం’ కాకపోవచ్చు కానీ ‘దాల్‌ మే కుచ్‌ కాలా హై’ అనిపించక తప్పుదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top