రిపోర్టరుకు షాకిచ్చిన అఖిలేష్‌ | Sakshi
Sakshi News home page

మాకో ఇల్లు చూపించండి...అప్పుడు ఖాళీ చేస్తాము

Published Tue, May 29 2018 2:46 PM

Akhilesh Yadav Asks Reporter Find Me A Place In Lucknow - Sakshi

లక్నో : మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేసి వెళ్లాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తమకు కొంత సమయం కావాలంటూ  సమాజ్‌వాద్‌ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేష్‌ మీడియాకు సవాల్‌ చేశారు. .‘నాకు అనుకూలమైన ఇంటిని చూడండి...అప్పుడు నేను ఈ బంగ్లాను వదిలి వెళ్తాను’ అని తెలిపారు.

మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు గురించి అఖిలేష్‌ మీడియాతో మాట్లాతుండగా...ఒక జర్నలిస్ట్‌ ‘అధికార బంగ్లాలను వదిలి వెళ్లే అంశం’  గురించి ప్రస్తావించాడు. దానికి ఆయన ఏమాత్రం తడుముకోకుండా ‘మేము ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం...కానీ మాకు కొంత సమయం కావాలి. నాకు, నేతాజీకి ఈ లక్నో పట్టణంలో నివసించడానికి స్థలం లేదు. ఒక వేళ మీరు మాకోసం అనువైన ప్రదేశాన్ని చూస్తే..అప్పుడు మేము తప్పకుండా ఈ బంగ్లాను ఖాళీ చేస్తామ’ని అన్నారు.

అంతేకాకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆ జర్నలిస్ట్‌పై అఖిలేష్‌ అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలన్న సుప్రీం ఆదేశాలను అనుసరించి యూపీ సర్కార్‌ మాజీ ముఖ్యమంత్రులకు నివాసాలు ఖాళీ చేయవల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  అయితే ములాయం ఆరోగ్యం దృష్ట్యా ఇప్పటికిప్పుడే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయలేమని, తమకు రెండేళ్ల సమయం కావాలంటూ అఖిలేష్‌ యాదవ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు.

Advertisement
Advertisement