అభినందన్‌కు వీర్‌చక్ర.. లేడీ స్క్వాడ్రన్‌కు మెడల్‌

Abhinandan Varthaman to be conferred Vir Chakra on August 15 - Sakshi

న్యూఢిల్లీ: భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వర్ధమాన్‌కు కేంద్ర ప్రభుత్వం  వీర్‌చక్ర పురస్కారం ప్రదానం చేయనుంది. బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత భారత గగనతలంలోకి చొరబడిన పాక్‌ F16 యుద్ధవిమానాన్ని మిగ్-21  ఫైటర్‌జెట్‌తో అభినందన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. 

మిగిలిన పాక్‌ విమానాలను తరిమికొట్టే క్రమంలో అతని మిగ్ 21 ఫైటర్‌ జెట్‌ కూలిపోయింది. దీంతో తమ భూభాగంలో ల్యాండ్ అయిన వర్థమాన్‌ని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది.  అయితే, భారత్‌ తీసుకొచ్చిన దౌత్య ఒత్తిడితో మార్చి 1వ ఆయనను తేదీన విడుదలచేసింది. శత్రుచెరలో 60 గంటలు గడిపి.. దాయాది సైన్యం ఎంత ఒత్తిడిచేసినా సైనిక రహస్యాల గుట్టువిప్పకుండా... సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చిన వర్థమాన్‌పై ప్రశంసల జల్లుకురిసింది. అతడి వీరత్వానికి గుర్తింపుగా కేంద్రప్రభుత్వం వీరచక్రతో సత్కరించింది. జవాన్లకిచ్చే పరమవీరచక్ర, మహావీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది.

ఇక, భారత ఆర్మీకి చెందిన సప్పర్‌ ప్రకాశ్‌ జాధవ్‌కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం దక్కింది. ఇక భారత సైన్యానికి ఎనిమిది శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేన మెడళ్లు (గాలంట్రీ), నాలుగు మెన్షన్‌ ఇన్‌ డిస్పాచెస్‌ దక్కాయి. ఇక, భారత వాయుసేనకు ఐదు యోధ సేవ మెడళ్లు, ఏడు వాయుసేన మెడళ్లు వచ్చాయి. ఈ మెడళ్లు సాధించిన వారిలో బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన మిరాజ్‌ ఫైటర్‌ పైలట్లు కూడా ఉన్నారు. మొత్తం 13మందికి ఈ మెడళ్లు దక్కగా.. అందులో 12మంది ఫైటర్‌ ఫైలట్లు కాగా, ఒకరు లేడీ స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌. భూతలంలో  ఫ్లయిట్‌ కంట్రోలర్‌గా ఉన్న ఆమె..  బాలాకోట్‌ దాడుల అనంతరం గగనతలంలో పాక్‌ ఫైటర్‌ జెట్‌ దాడులను భారత పైలట్లు తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకుగాను ఆమెను యోధ సేవ మెడల్‌ వరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top