భార్యను విడిచిపెడితే, మీ ఆస్తులు గోవిందా

Abandon Your Wife and Lose Your Properties in India - Sakshi

న్యూఢిల్లీ :  తమ కుమార్తెలకు విదేశీ సంబంధాల కోసం తల్లితం‍డ్రులు ఉబలాటపడుతుంటే, ఎన్‌ఆర్‌ఐ పెళ్ళిళ్లు అమ్మాయిలకు కన్నీళ్లు మిగుల్చుతున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. భారత్‌లో పెళ్లి చేసుకుని, కట్నం కానుకలు తీసుకుని భార్యలను విదేశాలకు తీసుకెళ్తున్న భర్తలు, వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వదిలి వేయడం, శారీరక వేధింపులకు గురిచేయడం..వంటి పలు కారణాలతో ఆడపిల్లలను వేధిస్తున్నారు. ఈ వేధింపులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భార్యను వేధించినా.. వదిలేసినా భారత్‌లో భర్త లేదా వారి కుటుంబసభ్యుల ఆస్తులను సీజ్‌ చేయాలని  అంతర్ మంత్రిత్వ కమిటీ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. వదిలివేయబడ్డ మహిళలకు చట్టపరమైన పరిష్కారంగా, జస్టిస్‌ కోసం భర్త, వారి కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్‌ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు పేర్కొంది. 

ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో 2015 జనవరి 1 నుంచి 2017 నవంబర్‌ 30 మధ్యలో ఈ తరహా ఫిర్యాదులు 3,328 వరకూ అందాయని తెలిసింది.  ఎన్‌ఆర్‌ఐ భర్తలు, భార్యలను వదిలివేయడం, వేధించడం, కట్నం డిమాండ్లు, శారీరక వేధింపులు, పాస్‌పోర్ట్‌ సీజ్‌ వంటి చేష్టలకు పాల్పడుతున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ఇప్పటి నుంచి అన్ని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లను స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌కు లింక్‌ చేయనున్నామని, ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియను ముగించనున్నట్టు కేంద్ర మంత్రి మేనకా గాంధీ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న వారిలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌, న్యాయమంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌లు కూడా ఉన్నారు. 

డబ్ల్యూసీడీ కింద ఒక ఇంటిగ్రేటెడ్‌ నోడల్‌ ఏజెన్సీని నియమించాలని, ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను అది విచారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ తరహా కేసుల్లో ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్టులు కూడా రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తప్సనిసరి అన్ని రాష్ట్రాలు అన్ని పెళ్లిళ్లను రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టడం లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top