ఆధార్‌తో ఆదా ఎంతంటే..

Aadhaar helped Indian govt check fraud - Sakshi

వాషింగ్టన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్‌ కార్డు స్కీమ్‌తో వేల కోట్లు ఆదా అయ్యాయని దాని రూపకర్త నందన్‌ నిలేకాని చెప్పారు. లబ్ధిదారుల జాబితాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టడం ద్వారా ఆధార్‌ మూలంగా దాదాపు రూ 50,000 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగామని అన్నారు. గత యూపీఏ హయాంలో చేపట్టిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీల నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం సమధికోత్సాహంతో ప్రోత్సహిస్తోందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కూడా అయిన నిలేకాని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ ఎకానమీ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మెరుగైన డిజిటల్‌ మౌలిక వసతుల నిర్మాణంతో శీఘ్రగతిన ముందుకెళ్లడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు మంచి అవకాశమని చెప్పారు. ఆధార్‌ను ఇప్పటివరకూ వంద కోట్ల మందిపైగా నమోదు చేసుకున్నారని తెలిపారు. లబ్ధిదారులు, ఉద్యోగుల జాబితా నుంచి నకిలీలు, డూప్లికేట్‌లను గుర్తించి వారిని తొలగించడంతో ప్రభుత్వ ఖజానాకూ పెద్ద ఎత్తున నిధులు ఆదా అయ్యాయని అన్నారు.ఆధార్‌ కారణంగా తాము 50 కోట్ల మంది ఐడీలను వారి బ్యాంక్‌ ఖాతాలకు జోడించామని, ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ వ్యవస్థకు బాటలు పరిచామని చెప్పారు. ఆధార్‌తో మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించనున్నామని నిలేకాని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top