ఈబీసీలకు 4,800 ఎంబీబీఎస్‌ సీట్లు | Sakshi
Sakshi News home page

ఈబీసీలకు 4,800 ఎంబీబీఎస్‌ సీట్లు

Published Sat, Jul 13 2019 3:15 AM

4,800 MBBS seats reserved for economically weaker students - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ఈ సంవత్సరం 4,800 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించినట్లు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. గడిచిన రెండేళ్లలో మెడికల్‌ కాలేజీల్లో 24,698 గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు పెరిగాయన్నారు. 2019–20లోనే 10,565 గ్రాడ్యుయేట్, 2,153 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు పెరిగాయన్నారు. దేశంలో 75 వేల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మెడికల్‌ కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్లు పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు. ఎంబీబీఎస్‌ కోర్సుకు అనుమతి వచ్చిన మూడేళ్లలో పీజీ కోర్సును ప్రారంభించడం తప్పనిసరి చేశామన్నారు. జిల్లా ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

కేంద్ర పథకం కింద కొత్త కాలేజీలు..
2014 జనవరిలో ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం కింద 82 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 60 శాతం నిధులను కేంద్రం, 40 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే, 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు సమకూర్చుతాయి. మొదటి దశలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 జిల్లా ఆస్పత్రులను గుర్తించి ఆమోదించామని హర్షవర్ధన్‌ తెలిపారు. ఒక్కో వైద్య కళాశాల స్థాపనకు రూ.189 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తం వైద్య కళాశాలల కోసం రూ.7,507 కోట్లను ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేశామని చెప్పారు. రెండో దశలో 8రాష్ట్రాల్లోని 24 కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు.

Advertisement
Advertisement