200 మంది మావోయిస్టులు చుట్టుముట్టి.. | Sakshi
Sakshi News home page

200 మంది మావోయిస్టులు చుట్టుముట్టి..

Published Wed, Jul 20 2016 2:40 AM

200 మంది మావోయిస్టులు చుట్టుముట్టి.. - Sakshi

* 22 ఐఈడీ పేలుళ్లు, కాల్పులు
* బిహార్ ఎన్‌కౌంటర్‌లో పది మంది కోబ్రా కమాండోల మృతి

పట్నా: బిహార్‌లో మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికీ మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌కు చెందిన 10 మంది కమాండోలు మృత్యువాత పడ్డారు. సుమారు 200 మంది మావోయిస్టులు ఒక్కసారిగా కమాండోలను చుట్టుముట్టి 22 ఐఈడీలను పేల్చడమే కాక.. కాల్పులకు తెగబడ్డారు. 10 మంది కమాండోలు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతమంది కమాండోలను సీఆర్‌పీఎఫ్ కోల్పోవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.  

ఔరంగాబాద్ జిల్లాలోని దుమారీ నాలా అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా కమాండోలు, ఇతర బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయని అధికారులు చెప్పారు. ముందుగా కమాండోలు కాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారన్నారు.

ఇదే సమయంలో మావోయిస్టుల ట్రాప్‌లో కమాండోలు చిక్కుకుపోయారని, దీంతో  200 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టి 22 ఐఈడీలను పేల్చడమే కాక.. వారిపై కాల్పులు జరిపారని చెప్పారు.  ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు.  సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్ కె.దుర్గాప్రసాద్, ఇన్‌స్పెక్టర్ జనరల్(ఆపరేషన్స్) జుల్ఫీకర్ హసన్, ఇతర అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement
Advertisement