ముగిసిన విజయ ప్రస్థానం

Vijaya Bapineedu Special Story - Sakshi

బాపినీడు మృతితో చాటపర్రులో విషాదం

అగ్ర దర్శకుడిగా మన్ననలు అందుకున్న గ్యాంగ్‌లీడర్‌

పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రముఖ సినీ దర్శకుడు విజయ బాపినీడు మృతి చెందారని తెలియడంతో ఆయన స్వగ్రామం చాటపర్రులో విషాదం నెలకొంది. 1936వ సంవత్సరం సెప్టెంబర్‌ 22వ తేదీన జిల్లా కేంద్రం ఏలూరుకు సమీపంలోని చాటపర్రు గ్రామంలో గుత్తా సీతారామస్వామి, లీలావతి దంపతులకు జన్మించిన గుత్తా బాపినీడు చౌదరి స్థానిక సీఆర్‌ రెడ్డి కళాశాలలో డిగ్రీ చదివారు. చదువు అనంతరం విజయ అనే సినీ పత్రిక నిర్వహించారు. విజయ పత్రిక నిర్వహించడంతో విజయ బాపినీడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సినిమాలపై మక్కువ పెంచుకున్న బాపినీడు చెన్నై చేరుకుని తొలుత నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 1976లో “యవ్వనం కాటేసింది’ అనే సినిమాతో నిర్మాతగా మారారు.

అనంతరం దర్శకత్వ శాఖలోకి ప్రవేశించి తిరుగులేని విజయాలు సాధించారు. చిరంజీవి, శోభన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ వంటి నటులతో ఆయన చేసిన సినిమాలు తెలుగు చలనచిత్ర రంగంలో రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా చిరంజీవితో ఆయన రూపొందించిన పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, గ్యాంగ్‌లీడర్‌ తదితర విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. కాగా దాదాపు 20 సంవత్సరాల నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు. తాను పుట్టిన గ్రామంలో మాత్రం బంధువులు, మిత్రులకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని, ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా మాట్లాడేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆయన సమకాలీనులు గ్రామంలో లేకపోవడంతో ఆయనకు సంబంధించిన బాల్య స్మృతులను గుర్తు చేసే అవకాశం లేకపోయింది.

మాగంటి కుటుంబంతోఅనుబంధం
దివంగత మాజీ మంత్రి మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరి కుటుంబంతో ఆయనకు దూరపు బంధుత్వంతో పాటు సినీ బంధుత్వం కూడా ఉంది. మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరి నిర్మాతగా ఆయన దర్శకత్వంలో రూపొందించిన ఖైదీ నెంబర్‌ 786 అప్పట్లో భారీ హిట్‌ సినిమా. అలాగే చిరంజీవితో ఆయన రూపొందించిన గ్యాంగ్‌ లీడర్‌ రికార్డులను తిరగరాసింది. ఆ చిత్రం శతదినోత్సవ వేడుకలను తన స్వగ్రామానికి దగ్గరైన ఏలూరులో అత్యంత భారీగా నిర్వహించారు. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన అనేక చిత్రాలను పంపిణీ చేసిన ఉషా పిక్చర్స్‌ అధినేత వీవీ బాల కృష్ణారావు ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు వినోదంతో పాటు నిర్మాతలు, పంపిణీ దారులకు లాభాలు చేకూర్చాలనే అక్ష్యంతో ఆయన చిత్రాలు రూపొందించారన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top