విజయ్‌తో ఢీ అంటున్నశింబు | Vijay D With Simbu | Sakshi
Sakshi News home page

విజయ్‌తో ఢీ అంటున్నశింబు

Mar 30 2016 1:50 AM | Updated on Apr 3 2019 8:56 PM

విజయ్‌తో ఢీ అంటున్నశింబు - Sakshi

విజయ్‌తో ఢీ అంటున్నశింబు

సంచలన నటుడు శింబు ఇళయదళపతి విజయ్‌తో ఢీ కొంటున్నానంటున్నారు. ఇప్పటికే ఈయన నటుడు అజిత్ వీరాభిమానిగా

సంచలన నటుడు శింబు ఇళయదళపతి విజయ్‌తో ఢీ కొంటున్నానంటున్నారు. ఇప్పటికే ఈయన నటుడు అజిత్ వీరాభిమానిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకున్న శింబు విషయంలో అజిత్ స్పందించలేదన్న ఆరోపణలు ఎదురైనా, అభిమానం వేరు, అజిత్ స్పందిచక పోవడం వేరని కొట్టి పారేశారు. శింబు ఇప్పుడు అజిత్‌కు పోటీగా అభిమానులు భావించే విజయ్‌తో శింబు పోటీకీ కాలు దువ్వుతున్నారు. వివరాల్లోకెళ్లితే విజయ్ నటిస్తున్న తాజా చిత్రం తెరి.
 
  సమంత, ఎమీజాక్సన్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న తెరి చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల  పనిలో ఉంది. దీనికి యు సర్టిఫికెట్ వస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. కాగా తెరి చిత్రాన్ని తమిళ ఉగాది సందర్భంగా ఎప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇకపోతే సంచల నటుడు శింబు నటిస్తున్న చిత్రం ఇదు నమ్మఆళు. నయనతార, ఆండ్రియా నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై టి.రాజేందర్ నిర్మిస్తున్నారు.చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
 
  ఈ చిత్రం ద్వారా శింబు తమ్ముడు కురలరసన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఇదు నమ్మఆళు చిత్రాన్ని తెరికి పోటీగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు శింబు తన ట్విట్టర్‌లో పేర్కొనడం పెద్ద వార్తగా మారింది. విజయ్ తెరి చిత్ర క్రేజ్‌ను ఎదుర్కొనే సత్తా ఇదు నమ్మఆళుకు ఉందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పాండిరాజ్ దర్శకత్వం, మాజీ ప్రేమికులు శింబు, నయనతార కలిసి నటించడం వంటి అంశాలు ఇదు నమ్మఆళుకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అయినా తమిళ ఉగాదికి విడుదలయ్యే చిత్రాలలో ఏది విజేతగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement