నటనామణి

Veteran Telugu actor Geetanjali passes away - Sakshi

ప్రముఖ నటి గీతాంజలి (72) ఇక లేరు. బుధవారం హఠాత్తుగా కడుపు నొప్పి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను రాత్రి 11.45 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారు జామున ఆమె తుది శ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించారు గీతాంజలి. ఆమె అసలు పేరు మణి. ఆమె తల్లిదండ్రులకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి అయితే మణి రెండో కుమార్తె. మూడేళ్ల వయసు నుంచే అక్క స్వర్ణతో కలిసి కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది.

భర్త రామకృష్ణతో...

పలు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైంది మణి. ఆ సినిమాలోని ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ...’ పాట నేటికీ శ్రీరామ నవమి పందిళ్లలో, పెళ్లి పందిళ్లలో వినిపిస్తుంటుంది.‘సీతారామ కల్యాణం’లో సీత పాత్ర ఒప్పుకున్నప్పుడు గీతాంజలి వయసు 14. ఎన్టీఆర్‌ రావణాసురుడు, రాముడేమో హరనాథ్‌. అంతకుముందు ‘రాణీ రత్నప్రభ’ అనే సినిమాలో గీతాంజలి చేసిన ఓ డ్యాన్స్‌ బిట్‌ చూసి, ‘సీతారామ కల్యాణం’లో సీత పాత్రకు తీసుకోవాలనుకున్నారు ఎన్టీఆర్‌.

‘నవరాత్రి’లో ఓ దృశ్యం

ఆ చిత్రానికి ఆయనే దర్శకుడు. ‘‘ఏం భయపడొద్దు. మీరే సీత అనుకోండి.. చేయండి’’ అని భయపడుతున్న గీతాంజలితో అన్నారు. ఎన్టీఆర్‌ చెప్పింది చెప్పినట్లు చేశారామె. సినిమా రిలీజైంది. ఘనవిజయం సాధించింది. అప్పుడు గీతాంజలి ఎక్కడ కనిపించినా ‘అదిగో సీత’ అనేవారు. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు గీతాంజలి. ఎన్టీఆర్‌ తిలకం దిద్దేవారని, ‘సీతారామ కల్యాణం’ వంద రోజుల వేడుక శ్రీరామ నవమి వేడుకలా జరగడం మరచిపోలేనని  ఓ సందర్భంలో పేర్కొన్నారామె. ‘మణి’ పేరుతో  పరిచయమైన ఆమె గీతాంజలిగా ఎలా మారారంటే?

హిందీ చిత్రంతో పేరు మార్పు
ఆ మార్పుకి కారణం హిందీ సినిమా ‘పారస్‌ మణి’ (1963). అందులో గీతాంజలిది రాజకుమారి పాత్ర. సినిమా పేరు ‘పారస్‌ మణి’,  కథానాయిక నిజమైన పేరు ‘మణి’ అంటే కన్‌ఫ్యూజ్‌ అవుతారని చిత్రదర్శకుడు బాబూ భాయ్‌ మిస్త్రీ ‘గీతాంజలి’గా మార్చారు. అప్పటివరకూ దక్షిణాది తెరపై ‘మణి’ పేరుతో పాపులర్‌ అయిన గీతాంజలి ఆ తర్వాతి నుంచి మార్చిన పేరుతో కొనసాగడం విశేషం. మణి సార్థక నామధేయురాలు అనాలి.

పేరుకి తగ్గట్టుగానే నటనలో ‘మణి’ అనిపించుకుని, మంచి ‘నటనామణి’గా తెలుగు చలన చరిత్రలో నిలిచిపోయారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు గీతాంజలి. మలయాళ సినిమా ‘స్వప్నంగళ్‌’లో ఆమె అంధురాలి పాత్ర చేశారు. అప్పుడు గీతాంజలికి 18 ఏళ్లు. ఆ సినిమాలో గీతాంజలి చిన్ననాటి పాత్రను శ్రీదేవి చేయడం విశేషం. అప్పుడు శ్రీదేవికి తొమ్మిదేళ్లు. తమిళంలో శారద, దైవత్తిన్‌ తాయ్, పనమ్‌ పడైత్తవన్‌.. ఇలా పలు చిత్రాల్లో నటించారు.

హీరోయిన్‌ టు హాస్యం
ఒకవైపు కథానాయికగా నటిస్తూనే చెల్లెలి పాత్రలూ చేసేవారు. ‘డా. చక్రవర్తి’లో చేసిన ఏయన్నార్‌ చెల్లెలి పాత్ర, ‘లేత మనసులు’లో చేసిన డ్యాన్స్‌ టీచర్‌ తదితర పాత్రలు గీతాంజలికి మంచి పేరు తెచ్చాయి. ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో కథానాయికగా చేసిన ‘ఇల్లాలు’ సినిమా కూడా గీతాంజలి కెరీర్‌కి ప్లస్‌ అయింది. అందులో ఆమె కథానాయికగా, దొంగగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే కథానాయికగా కొనసాగుతున్న సమయంలో ‘దేవత’ సినిమాలో హాస్యపాత్ర ఒప్పుకోవడం తాను చేసిన తప్పు అని, పద్మనాభం వల్లే తన కెరీర్‌ హాస్యం వైపు మళ్లిందని ఓ సందర్భంలో గీతాంజలి చెప్పారు.

సినిమా పరిశ్రమలో ఏదైనా పాత్ర బాగా క్లిక్‌ అయితే ఆ తర్వాత ఆ ఆర్టిస్ట్‌ని ఆ తరహా పాత్రలకు పరిమితం చేయడం ఓ ఆనవాయితీ. అలా ‘దేవత’ చిత్రంలో గీతాంజలి చేసిన హాస్య పాత్రకు మంచి ప్రశంసలు రావడంతో దర్శకులు ఆమెని చూసే దృష్టి కోణం మారిపోయింది. అప్పటినుంచి ఆమెకు కామెడీ పాత్రలకే అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే  ‘వ్యాంప్‌ క్యారెక్టర్స్‌’, ‘డ్యాన్స్‌ నంబర్స్‌’ కూడా చేశారామె. హీరోయిన్‌గా దాదాపు 50 చిత్రాలు చేసిన గీతాంజలి కెరీర్‌ కామెడీ ఆర్టిస్ట్‌కి మారింది. అయితే కామెడీ జంటల్లో పద్మనాభం, గీతాంజలిలది హిట్‌ పెయిర్‌. ‘మర్యాద రామన్న’, ‘పొట్టి ప్లీడరు’ వంటి చిత్రాల్లో జంటగా నటించారు.

అది గీతాంజలి నిజాయతీకి నిదర్శనం
మామూలుగా రీమేక్‌ సినిమాలు చేస్తున్నప్పుడు ‘నా స్టయిల్‌లో చేశాను. కాపీ కొట్టలేదు’ అని చెబుతుంటారు. కానీ గీతాంజలి మాత్రం ‘కాపీ కొట్టాను’ అని ఒప్పుకోవడం ఆమె నిజాయతీకి నిదర్శనం. తమిళంలో కె. బాలచందర్‌ తెరకెక్కించిన ‘ఎదిర్‌ నీచ్చల్‌’ సినిమాని ‘సంబరాల రాంబాబు’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. అందులో షావుకారు జానకి చేసిన పాత్రను తెలుగులో గీతాంజలి చేశారు. ‘‘తమిళ సినిమాలో షావుకారు జానకి పాత్ర చూశాను. ఆమెను కాపీ కొట్టాను’’ అని ఓ సందర్భంలో గీతాంజలి అన్నారు.

బామ్మగా రీ–ఎంట్రీ
కెరీర్‌ సజావుగా కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ నటుడు రామకృష్ణతో గీతాంజలి వివాహం జరిగింది. వాస్తవానికి వారిది ప్రేమ వివాహం అనుకుంటారు కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లే అని గీతాంజలి స్వయంగా పేర్కొన్నారు. పెళ్లి తర్వాత భర్త విశ్రాంతి తీసుకోమనడంతో గీతాంజలి సినిమాలకు దూరమయ్యారు. నటిగా రీ–ఎంట్రీలో ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంలో చేసిన బామ్మ పాత్ర క్లిక్‌ అయింది. ఆ తర్వాత ఆమె ఈ తరహా పాత్రలు చేయడం మొదలుపెట్టారు.

తనయుడిని నటుడిని చేయాలనుకున్నారు
గీతాంజలి–రామకృష్ణ దంపతులకు ఓ కుమారుడు శ్రీనివాస్‌ ఉన్నారు. శ్రీనివాస్‌ని నటుడిని చేయాలనే ఆకాంక్ష ఇద్దరికీ ఉండేది. 2001లో రామకృష్ణ చనిపోయారు. అప్పటివరకూ చెన్నైలోనే ఉంటున్న గీతాంజలి భర్త దూరమయ్యాక హైదరాబాద్‌కి మకాం మార్చారు. శ్రీనివాస్‌ ఓ మూడు సినిమాలు కమిట్‌ అయినా, అవి విడుదల వరకూ రాలేదు.

చిత్రప్రముఖుల నివాళి
గీతాంజలి హఠాన్మరణం చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి ఆమె భౌతిక కాయాన్ని నందీ నగర్‌లోని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్‌ ఆవరణలో ఉంచారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, జీవితా రాజశేఖర్, పరుచూరి గోపాలకృష్ణ, వీకే నరేష్‌.. ఇలా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతాంజలి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

తెలుగు సినిమాల్లో గీతాంజలి చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించిన గీతాంజలి అక్కడ కూడా తన ప్రతిభ చూపారని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గీతాంజలి మరణం పట్ల తెలంగాణ సీఎం  కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సీతారామ కల్యాణం’తో పాటు అనేక తెలుగు చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన నటన గుర్తుండిపోతుందన్నారు.

చెమర్చిన కళ్లతో శ్రీనివాస్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top