హీరో రాజశేఖర్‌ కారుకు మరో ప్రమాదం

Telugu Hero Rajasekhar Meets with a Car accident, Escapes Unhurt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ మరోసారి రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. రామెజీఫిల్మ్‌ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో రాజశేఖర్‌ ఒక్కరే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయినట్టు సమాచారం. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

రెండేళ్ల క్రితం పీవీఎన్‌ఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి రాజశేఖర్‌ బయటపడ్డారు. తన కారుతో మరొకరి వాహనాన్ని ఆయన ఢీకొట్టారు. అయితే బాధితుడు రామిరెడ్డితో వివాదం పరిష్కరించుకోవడంతో పోలీసులు నమోదు చేయలేదు. క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ నిర్మిస్తున్న సినిమాలో ప్రస్తుతం రాజశేఖర్‌ నటిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకుడు.

ప్రమాదంలో ధ్వంసమైన రాజశేఖర్‌ కారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top