నవ్వు చిన్నబోయింది

Telugu Film Comedian Venu Madhav Passes Away - Sakshi

వెండితెర మీద నవ్వులు తరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్‌, గుండూ హనుమంతరావు లాంటి టాప్‌ కమెడియన్లను తెలుగు సినిమా కోల్పోగా..  తాజాగా మరో స్టార్‌ కమెడియన్‌ వేణుమాధవ్‌ కన్నుమూశారు. 400లకు పైగా సినిమాల్లో నవ్వులు పంచిన వేణు మాధవ్‌ కాలేయ సంబందిత సమస్యతో మరణించారు. ఆయనకు భార్య శ్రీవాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మిమిక్రీ ఆర్టిస్ట్‌గా స్టేజ్‌ షోలు చేసిన వేణుమాధవ్ తరువాత బుల్లితెర మీద తరువాత వెండితెర మీద తనదైన ముద్రవేశారు. 1996లో రిలీజ్‌ అయిన సాంప్రదాయం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ కామెడీ స్టార్‌ దాదాపు దశాబ్ద కాలంపాటు వెండితెరను ఏలాడు. ఒక దశలో తెలుగులో రిలీజ్‌ అయిన ప్రతీ సినిమాలో వేణుమాధవ్‌ కనిపించారంటే అతిషయోక్తి కాదు. అంతేకాదు ఒక్క 2005లో వేణు మాధవ్‌ నటించిన 60 సినిమాలు విడుదలయ్యాయంటే ఆయన ఎంత బిజీ నటుడో అర్ధం చేసుకోవచ్చు.

ఫ్యామిలీతో వేణుమాధవ్‌ 

కెరీర్‌ తొలినాళ్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన వేణుమాధవ్‌, తొలి ప్రేమ సినిమాతో బ్రేక్‌ వచ్చింది. ఆ సినిమాలో ప్రేమికుల గురించి వేణు మాధవ్ చెప్పిన డైలాగ్‌ సెన్సేషన్‌ సృష్టించింది. తరువాత దిల్‌, ఆది, ఛత్రపతి, సై లాంటి సినిమాల్లో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ సినిమాలో చేసిన సత్తన్న పాత్రకు నంది అవార్డు సైతం వరించింది.

సొంతం, నువ్వే నువ్వే, నాగ, సాంబ, ఆర్య, గుడుంబా శంకర్, శంకర్‌ దాదా ఎంబీబీయస్‌, మాస్‌, బన్నీ, అతనొక్కడే, సూపర్‌, జై చిరంజీవ, రణం, పోకిరి, కిక్‌, దేశ ముదురు, నేనింతే లాంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రల్లో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వేణుమాధవ్‌.

తనను వెండితెరకు పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హంగామా సినిమాతో అలీతో కలిసి హీరోగా పరిచయం అయ్యారు. తరువాత భూకైలాష్‌, ప్రేమాభిషేకం సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాదు ప్రేమాభిషేకం సినిమాను తానే స్వయంగా నిర్మించారు. చివరగా రుద్రమదేవి సినిమాలో నటించిన వేణు మాధవ్‌ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై రకరకాల వందుతులు వినిపించాయి. పలుమార్లు వేణుమాధవ్ స్వయంగా ఈ వార్తలు ఖండించారు. అయితే బుధవారం అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియ జేస్తున్నారు.

చదవండి:

హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూత

నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

నేను మౌలాలి మెగాస్టార్ని!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top